షటర్ లిఫ్టింగ్ ముఠా సభ్యుల అరెస్ట్
● ఇద్దరు నిందితుల రిమాండ్,
పరారీలో మరో ఇద్దరు..
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: పలు జిల్లాలలో దుకాణాల షటర్లను ఇనుప రాడ్‌లతో ఎత్తి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర షటర్ లిఫ్టింగ్ దొంగల ముఠా సభ్యులను పట్టుకున్నామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 9 వ తేదీ వేకువజామున జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్, భగత్‌సింగ్ నగర్ కాలనీల్లోని తాళం వేసిన దుకాణాలు, ఇళ్లను టార్గెట్ చేసి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 4 షటర్లను ఎత్తి నగదు, సెల్‌ఫోన్‌లు, ఇళ్ల ముందు నుంచి రెండు బైక్‌లను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విచారణ జరిపారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని ప్రభత్వ డిగ్రీ కళాశాల మైదానం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పోలీసులు పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. పట్టుబడిన నిందితులిద్దరూ మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన మైనర్‌లు. వారితో పాటు ఈ కేసులో ప్రధాన నిందితులైన మరో ఇద్దరిని నాందేడ్ జిల్లా కిన్వాట్ గ్రామానికి చెందిన సోను పిరాజీ పవార్, హింగోలి జిల్లాకు చెందిన అనికేత్ జాదవ్‌లుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. వారిని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
కామారెడ్డి పోలీసులు పట్టుకున్న షటర్ లిఫ్టింగ్ ముఠాపై జిల్లా కేంద్రంలో చేసిన 4 చోరీలతో పాటు జగిత్యాలలో 4, మెట్‌పల్లిలో 2 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. చోరీ చేసిన 2 బైక్‌లు, ఇనుప రాడ్, ముఖానికి ధరించిన మాస్కులను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన పట్టణ సీఐ నరహరి, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, పట్టణ ఎస్సై బాల్‌రెడ్డి, గాంధారి ఎస్సై ఆంజనేయులు, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్, సిబ్బంది రవి, శ్రీనివాస్, గణపతి, లక్ష్మీకాంత్, రాజేందర్, కమలాకర్, రాజు నాయక్‌లను అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


