నాగన్నగారి బావికి మరింత శోభ!
● లైటింగ్, సీటింగ్‌తో పాటు
ఫుడ్ కోర్టులకు నిధులు
● రూ.2 కోట్లు మంజూరు
చేసిన ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : లింగంపేటలోని నాగన్నగారి మెట్లబావి వద్ద సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కృషితో ఈ నిధులు మంజూరయ్యాయి. వీటితో బావి వద్ద లైటింగ్, సీటింగ్ ఏర్పాట్లతో పాటు ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.
‘సాక్షి’ కథనంతో మహర్దశ
లింగంపేట మండల కేంద్రంలో 18వ శతాబ్దంలో నిర్మితమైన నాగన్నగారి బావి నిరాదరణకు గురై ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై 2022 జనవరి 29న ‘మెట్ల బావిలో నిర్లక్ష్యపు పూడిక’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అప్పటి కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. గ్రామస్తుల సహకారంతో ముళ్ల చెట్లను, చెత్తాచెదారాన్ని తొలగింపజేశారు. అందరూ శ్రమదానం చేసేలా ప్రోత్సహించారు. ఆయన స్వయంగా తట్టా, పార చేతబట్టి పనుల్లో పాల్గొన్నారు. తర్వాత రెయిన్ వాటర్ ప్రాజెక్టు అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన కల్పనా రమేశ్ బావికి పూర్వ వైభవం తీసుకురావడానికి అవసరమైన పనులన్నీ చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో మెట్లబావి రూపురేఖలు మారిపోయాయి. పనులు ముగిసిన తర్వాత దాని నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘానికి అప్పగించారు. ప్రస్తుతం ఈ మెట్ల బావిని చూడడానికి చాలామంది వస్తున్నారు. ఫొటో, వీడియో షూట్‌లు జరుగుతున్నాయి. మెట్ల బావిని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పర్యాటక శాఖ ద్వారా రూ.2 కోట్లు మంజూరు చేయించడంతో మరింత శోభ సంతరించుకోనుంది.
నాగన్నగారి బావికి మరింత శోభ!


