ఎఫ్‌ఐఆర్ ఎట్ డోర్ స్టెప్..
కామారెడ్డి క్రైం: రాష్ట్ర పోలీస్ శాఖ ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలు అందించే ఉద్దేశంతో ‘ఎఫ్‌ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. బుధవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పీఎస్‌ల ఎస్‌హెచ్‌వోలతో మాట్లాడారు. నూతన కార్యక్రమం అమలుపై దిశానిర్దేశం చేశారు. బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించడంపై సూచనలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి ఫిర్యాదు స్వీకరించాలని, అక్కడే కేసు నమోదు చేసి భరోసా ఇవ్వాలని సూచించారు. ఈ విధానం ముఖ్యంగా శారీరక దాడులు, అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్, మైనర్‌లపై వేధింపులు, గృహహింస లాంటి కేసుల్లో బాధితులకు ఎంతగానో సహాయపడుతుందన్నారు. ఫోన్‌కాల్, ఆన్‌లైన్ అభ్యర్థన, ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేయాలన్నారు. నూతన విధానంలో ఫిర్యాదుల నమోదు వేగవంతంగా జరగడంతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.


