నీట మునిగి గురుకుల విద్యార్థి మృతి
● బహిర్భూమికని వెళ్లి..
● ఈతకోసం నీటిలో దూకి మృత్యువాత
నిజాంసాగర్(జుక్కల్): బహిర్భుమి కోసం బయటకు వెళ్లిన ఎస్సీ గురుకుల కళాశాల విద్యార్థి నీటి కుంటలో పడి మరణించాడు. అచ్చంపేట గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లకు దిగువన చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండలం రాజపూర్ గ్రామానికి చెందిన గొట్టం అజయ్(17) అచ్చంపేట ఎస్సీ గురుకుల కళాశాలలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు అజయ్‌తోపాటు అశీష్, అఖిల్, అభిలాష్, మయూర్‌లు విధుల్లో ఉన్న టీచర్ అనుమతి తీసుకుని బహిర్భూమి కోసం బయటికి వెళ్లారు. అచ్చంపేట గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్లిన తర్వాత ఐదుగురు స్నేహితులు నిజాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లకు కింది భాగానికి వచ్చారు. బండరాళ్ల మధ్య ఉన్న నీటి గుంతను చూసిన అజయ్.. ఈత కొట్టేందుకు అందులో దూకి మునిగిపోయాడు. మిగతావారు గాలించి బండరాళ్ల మధ్య ఇరుక్కున్న అజయ్‌ను ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే అతడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ వచ్చేసరికే అజయ్ మరణించాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు దాదాపు కిలోమీటర్ దూరంలోని అచ్చంపేట రోడ్డు వరకు మోసుకువెళ్లారు. అక్కడినుంచి ప్రైవేట్ వాహనంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అజయ్ ప్రాణాలు పోయాయని మృతుడి బంధువులు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నీట మునిగి గురుకుల విద్యార్థి మృతి


