ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
కామారెడ్డి క్రైం: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక బలగాలను మోహరించింది. ఐదంచెల భద్రత కల్పించింది.
జిల్లాలో మూడు విడతల్లో కలిపి మొత్తం 532 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 609 లొకేషన్‌లలో 4,470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 33 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా, మరో 33 లొకేషన్‌లు సున్నితమైనవిగా గుర్తించారు. ఆయా ప్రాంతాలలో మొత్తం 780 పోలింగ్ కేంద్రాలున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో వివాదాలు, దాడులు, కేసుల వరకు వెళ్లిన ఘర్షణలు లాంటివి ఉంటే వాటిని సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తిస్తారు. చిన్నచిన్న వివాదాలు జరిగిన వాటిని సున్నితమైనవిగా పరిగణిస్తారు. ఇలా మొదటి విడత ఎన్నికల్లో 14, రెండో విడతలో 9, మూడో విడతలో 10 సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలు, అలాగే మొదటి విడతలో 14, రెండో విడతలో 10, మూడో విడతలో 9 సున్నితమైన కేంద్రాలున్నట్లు గుర్తించారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడత ఎన్నికల కోసం 54 రూట్ మొబైల్, 10 స్ట్రైకింగ్, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను నియమించారు. రెండో విడత కోసం 36 రూట్ మొబైల్, 7 స్ట్రైకింగ్, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను, మూడో విడత కోసం 37 రూట్ మొబైల్, 8 స్ట్రైకింగ్, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎస్పీ, ఏఎస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక రిజర్వ్‌డ్ బలగాలతో కూడిన బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఒక్కో విడతలో 800 మంది పోలీసు సిబ్బంది, అన్ని స్థాయిల్లోని పోలీసు అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
సూక్ష్మ పరిశీలకులు, సీసీ కెమెరాలతో నిఘా..
సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలకు అదనపు బలగాలు, సిబ్బందిని కేటాయించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు సూక్ష్మపరిశీలకులను నియమించారు. ఎన్నికల సిబ్బందితో పాటు ఒక ఎస్సై స్థాయి అధికారితో పాటు పోలీసు సిబ్బంది, అదనపు బలగాలు విధుల్లో ఉంటాయి. సున్నితమైన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మొత్తం ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరం వరకు 163 బీఎన్‌ఎస్‌ఎస్ (144 సెక్షన్) అమలులో ఉండనుంది. అన్ని విడతల్లో ఆయా మండలాల పరిధిలో ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రకటన పూర్తయ్యే వరకు నిశ్శబ్ద కాలం, డ్రై డే లాంటివి అమలులో ఉంటాయి. ప్రలోభాలకు గురి చేయడం నేరమని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరుతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నాం. సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బృందాలతో ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంది. గొడవలకు దిగడం, ప్రలోభాలకు గురి చేయడం చేస్తే కేసులు నమోదు చేస్తాం.
– రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి
కామారెడ్డి రూరల్: పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. సున్నితమైన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు సిబ్బంది నియమించామని, అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బుధవారం ఆయన కామారెడ్డి, రాజంపేట మండలాల్లోని పోలింగ్ బూతులను పరిశీలించారు. చిన్నమల్లారెడ్డి, రాజంపేట పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ విధుల్లో ఉన్న సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనుచిత కార్యకలాపాలు, గుంపులుగా తిరగడం, బెదిరింపులు లేదా ప్రలోభాలకు ఎట్టి పరిస్థితిలోనూ తావు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎస్సైలు ఉన్నారు.
జిల్లాలో 33 సమస్యాత్మక ప్రాంతాలు
సున్నితమైనవి మరో 33..
ఆయా చోట్ల 780 పోలింగ్ కేంద్రాలు
ప్రశాంతంగా ఎన్నికలు
నిర్వహించేందుకు ఐదంచెల భద్రత
గొడవలకు దిగితే కేసులు
తప్పవంటున్న పోలీసులు


