ఏకగ్రీవాల తిమ్మాపూర్
● 1962 నుంచి రెండుసార్లు మాత్రమే సర్పంచ్ ఎన్నికలు
తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం
ఎల్లారెడ్డిరూరల్: సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవంగా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు తిమ్మాపూర్ గ్రామస్తులు. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే ఎన్నికలు జరగగా ఆరుసార్లు సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జీపీ ఆవిర్భావం నుంచి..
తిమ్మాపూర్ గ్రామం 1962లో గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. నూతన జీపీకి మొట్ట మొదటి సర్పంచ్‌గా మామిడి కిష్టయ్య 25 ఏళ్లు (ఐదు టర్మ్‌లు) 1987 వరకు సర్పంచ్‌గా ఏకగ్రీవ సర్పంచ్‌గా కొనసాగారు. 1988లో మామిడి లక్ష్మీనారాయణ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు.1995లో జరిగిన ఎన్నికల్లో సావిత్రి గెలుపొందారు. 2000లో ఠాక్రియా నాయక్ ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2006లో జరిగిన ఎన్నికల్లో మామిడి రవీందర్ సర్పంచ్‌గా గెలుపొందారు. 2012లో మామిడి అరవింద్, 2019లో మామిడి దామోదర్ ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో సైతం గ్రామస్తులు ధారవత్ సోనిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎలాంటి వివాదాలు, గొడవలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అందరం కలిసి ఏకగ్రీవానికి మొగ్గు చూపుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఎన్నికల ఖర్చు తగ్గడంతోపాటు ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందించడంతో ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, అందుకే ఏకగ్రీవానికి మద్దతు తెలుపుతున్నామని అంటున్నారు.


