పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకొస్తా
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకొస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. పర్యాటక ప్రాంత అభివృద్ధి కోసం తాను ఎనలేని కృషి చేస్తున్నానని, ఇప్పటికే మొదటి విడత 20 కాటేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మంగళవారం మహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ సానుభూతి సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న నాయకులు ప్రజాసమస్యలను పట్టించుకోలేదని, అభివృద్ధి పనులను విస్మరించారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పి భూస్థాపితం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తూ, కాంగ్రెస్ మద్దతుదారులను ఎన్నికల్లో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ఏఎంసీ చైర్మనన్ చీకోటి మనోజ్, ఎన్‌ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డి, సాయిపటేల్, మహమ్మద్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


