విత్తన క్షేత్రంలో సాగునీటి తిప్పలు
నూతన బోర్ల తవ్వకానికి...
ప్రతిపాదనలు పంపాం
నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రాన్ని సమస్యలు వీడడం లేదు. సాగునీటి ఇబ్బందులతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. వందల ఎకరాల భూమి ఉన్న విత్తనక్షేత్రంలో పంటల సాగుకు పోచారం ప్రాజెక్టు నీరే ప్రధాన ఆధారం. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా విత్తన క్షేత్రంలోని బావిలోకి చేరిన నీటిని ఎత్తిపోసేందుకు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రెండు 30 హెచ్‌పీ మోటార్లను ఏర్పాటు చేశారు. ఇవి నీటిని ఎత్తిపోస్తూ సాగుభూములకు నీరందిస్తున్నాయి. ఇందులో ఒక మోటారు ఐదేళ్లుగా మొరాయిస్తోంది. దీంతో పంటలకు నీటిని అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో విత్తన క్షేత్రంలో పంటల సాగును తగ్గిస్తూ వస్తున్నారు. పంటల సాగుకు నోచుకోక విత్తన క్షేత్ర భూములు బీళ్లుగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి.
హైదరాబాద్‌లోనే మరమ్మతులు..
30 హెచ్‌పీ మోటారుకు మరమ్మతులు చేయించేందుకు క్షేత్ర అధికారులు తిప్పలు పడుతున్నారు. ఈ మోటారుకు హైదరాబాద్‌లోనే మరమ్మతులు చేసే అవకాశం ఉండడంతో గతంలో పలుమార్లు వారు దానిని అక్కడికి తీసుకెళ్లి మరమ్మతులు చేయించారు. కానీ గతంలో మరమ్మతులు చేయించిన మోటారు ప్రస్తుతం పూర్తిగా చెడిపోయింది. నలభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైపులైన్ సైతం దెబ్బతింది. 30 హెచ్‌పీ మోటార్‌తోపాటు పైపులైన్ మరమ్మతుల కోసం ఇటీవల అధికారులు రూ.15 లక్షల అంచనాతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు.
తడిసి మోపైడెన కరెంట్ బిల్లు..
మాల్తుమ్మెద విత్తన క్షేత్రానికి సంబంధించిన కరెంట్ బిల్లు కొంతకాలంగా భారీగా వస్తోంది. గతంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా విత్తన క్షేత్రంలో త్రీఫేజ్ కరెంట్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. కాగా 30 హెచ్‌పీ సామర్థ్యంతో కూడిన మోటార్లను వినియోగించడం వల్ల విత్తన క్షేత్రానికి ఉచిత విద్యుత్ వర్తించడం లేదు. క్షేత్రంలో కరెంట్‌ను వినియోగించినా, వినియోగించకపోయినా త్రీఫేజ్‌కు సంబంధించి ప్రతినెలా కరెంట్ బిల్లు వస్తోందని క్షేత్రఅధికారులు చెబుతున్నారు. బకాయిలు రూ.44లక్షలకు చేరాయని పేర్కొంటున్నారు.
విత్తన క్షేత్రంలో 10 బోర్లను తవ్వించేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో ఇటీవల భూగర్భజల శాఖ అధికారులు విత్తన క్షేత్రంలో పర్యటించి బోర్ల తవ్వకం కోసం స్థలాలను గుర్తించారు. ఉన్నతాధికారులు నిధులు మంజూరు చేసిన వెంటనే బోర్లను తవ్విస్తామని అధికారులు చెబుతున్నారు. కొత్త బోర్లలో 5 హెచ్‌పీ నుంచి 7.5 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్లు ఏర్పాటు చేసి పంటలను సాగుచేయాలని అధికారులు భావిస్తున్నారు. తక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ల వినియోగించి ఉచిత విద్యుత్ పథకాన్ని విత్తన క్షేత్రానికి వర్తింపజేసేలా సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపనున్నారు.
విత్తన క్షేత్రంలో చాలాకాలం క్రితం ఏర్పాటు చేసిన మోటార్లలో ఒకటి చెడిపోయింది. మరమ్మతులతోపాటు పైపులైన్ సరిచేయించేందుకు అవసరమైన నిధుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. దీంతోపాటు నూతన బోర్ల తవ్వకం కోసం సైతం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.
– ఇంద్రసేన్, ఏడీఏ, మాల్తుమ్మెద విత్తనోత్పత్తిక్షేత్రం
చెడిపోయిన 30 హెచ్‌పీ మోటారు
ప్రతిపాదనలకే పరిమితమైన
మరమ్మతులు
క్షేత్రంలో ఏటేటా తగ్గుతున్న
పంటలసాగు విస్తీర్ణం
విత్తన క్షేత్రంలో సాగునీటి తిప్పలు


