తొలిపోరుకు వేళాయె!
● 156 సర్పంచ్, 1,084 వార్డు
స్థానాలకు ఎన్నికలు
● 1,457 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు
● అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే...
చిన్నమల్లారెడ్డి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తున్న సిబ్బంది
జిల్లాలో తొలి విడతలో కామారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, బీబీపేట, రామారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్ మండలాల్లోని 167 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 11 పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 1,520 వార్డుల్లో 433 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు వార్డులలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 156 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు 727 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. 1,084 వార్డులకు 3,048 మంది పోటీ పడుతున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1,457 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
హోరాహోరీ పోటీ..
సర్పంచ్ పదవితో పాటు వార్డు స్థానాలకూ పోటీ హోరాహోరీగా సాగుతోంది. చిన్నచిన్న పంచాయతీల్లో సైతం సర్పంచ్ పదవికి ఐదు నుంచి పది మంది వరకు బరిలో నిలవడంతో తీవ్ర పోటీ నెలకొంది. అందరూ గెలుపు కోసం పోటాపోటీగా ఖర్చు చేశారు. కుల, యువజన సంఘాలను మచ్చిక చేసుకునేందుకు అనేక రకాల తాయిలాలు ప్రకటించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నవారు అడ్డగోలుగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి దాకా విస్త్రృత ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.
పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది..
బ్యాలెట్ పద్ధతిన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందించగా.. వారు ప్రత్యేక వాహనాల్లో బుధవారమే కేంద్రాలకు చేరుకున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యం గురువారం సాయంత్రమే తేలనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పూర్తి చేసి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ స్థానంతో పాటు వార్డు సభ్యులకు వచ్చిన బ్యాలెట్ పత్రాలను వేరు చేసిన తర్వాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయో లెక్కించి విజేతను ప్రకటిస్తారు.
మొత్తం ఓటర్లు 2,48,668
పురుషులు 1,18,342
మహిళలు 1,30,322
ఇతరులు 04
పోలింగ్ కేంద్రాలు 1,457
పోలింగ్ అధికారులు (పీవో) 1,848
ఇతర పోలింగ్ అధికారులు (ఓపీవో) 2,501
తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాలు 167
ఏకగ్రీవమైన పంచాయతీలు 11
పోలింగ్ జరిగే పంచాయతీలు 156
బరిలో ఉన్న అభ్యర్థులు 727
తొలి విడత ఎన్నికలు జరిగే వార్డులు 1,520
ఏకగ్రీవమైన వార్డులు 433
నామినేషన్లు దాఖలు కాని వార్డులు 03
పోలింగ్ జరుగుతున్న వార్డులు 1,084
బరిలో ఉన్న అభ్యర్థులు 3,048


