ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 27 2025 6:48 AM | Updated on Nov 27 2025 6:48 AM

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు 223 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు..

స్వేచ్ఛగా ఓటు వేసేలా...

223 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు..

జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. బుధవారం ఆయన ఎస్పీ రాజేశ్‌చంద్రతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఐదు వేలకన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌లు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలు, ఐదు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.30 వేలలోపు ఖర్చు చేయాలన్న నిబంధనలున్నాయని కలెక్టర్‌ తెలిపారు. అలాగే సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ ఫీజు రూ.2 వేలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. వెయ్యి, వార్డు సభ్యులకు రూ. 5 వందలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.250 నామినేషన్‌ ఫీజు ఉంటుందని పేర్కొన్నారు.

తొలివిడతలో కామారెడ్డి డివిజన్‌లోని 10 మండలాల పరిధిలో ఉన్న 167 గ్రామాల సర్పంచ్‌, 1,520 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. 62 క్లస్టర్లలో ఈనెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. వచ్చేనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ ఉంటుందని, అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

రెండో విడతలో ఎల్లారెడ్డి డివిజన్‌లోని నాలుగు మండలాలు, బాన్సువాడ డివిజన్‌లోని మూడు మండలాల పరిధిలో ఉన్న 197 సర్పంచ్‌, 1,654 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్‌ తెలిపారు. 57 క్లస్టర్లలో ఈనెల 30 నుంచి వచ్చేనెల 2 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. వచ్చేనెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌, 2 గంటల నుంచి కౌంటింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు.

మూడో విడతలో బాన్సువాడ డివిజన్‌లోని 8 మండలాల పరిధిలోగల 168 సర్పంచ్‌, 1,432 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్‌ సంగ్వాన్‌ తెలిపారు. 55 క్లస్టర్లలో వచ్చేనెల 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. వచ్చేనెల 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరుగుతుందని, 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసు భద్రతా చర్యలను పకడ్బందీగా చేసినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక బృందాలతో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందన్నారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో 223 సమస్యాత్మక, 527 సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ సంగ్వాన్‌ తెలిపారు. తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతంలో 153 క్రిటికల్‌, 164 సెన్సిటివ్‌, రెండో విడత జరిగే ప్రాంతంలో 26 క్రిటికల్‌, 223 సెన్సిటివ్‌ కేంద్రాలు, మూడో విడత ఎన్నికలు జరిగే ప్రాంతంలో 44 క్రిటికల్‌, 170 సెన్సిటివ్‌ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. క్రిటికల్‌, సెన్సిటివ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఉంటుందన్నారు. ఆయా మండల కేంద్రాల్లో మెటీరియల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. షెడ్యూల్‌ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement