అనర్హత వేటు పడుతుందా?
మున్సిపాలిటీల వారీగా వివరాలు..
● ఎన్నికల ఖర్చుల వివరాల సమర్పణలో జాప్యం
● గడువు ముగిసినా వివరాలు
అందించని అభ్యర్థులు
● జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో
447 మంది పోటీ
● లెక్కలు చెప్పింది 272 మందే..
కామారెడ్డి టౌన్ : ఎన్నికల ఖర్చుల లెక్కలు చెప్పడంలో అభ్యర్థులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గడువు ముగిసినా ఇప్పటికీ 175 మంది మున్సిపల్ అభ్యర్థులు వివరాలు సమర్పించలేదు. దీంతో వారిపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎ న్నికలు జరిగిన విషయం తెలిసిందే. జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. నా లుగు బల్దియాలలో కలిపి 92 వార్డులుండగా.. 447 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగ్గా.. 13 ఫలితాలు వెల్లడయ్యాయి. నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడైన 45 రోజుల్లోపు అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలోని నాలుగు మున్సిపల్ కార్యాలయాల్లో ట్రెజరీ, మున్సిపల్ శాఖల సిబ్బంది ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఎన్నికల ఖర్చు వివరాలను అభ్యర్థుల నుంచి స్వీకరించారు. అయితే ఇప్పటి వరకు 272 మంది మాత్రమే ఖర్చుల వివరాలను అధికారులకు అందజేశారు. మిగిలిన 175 మంది ఇంకా వివరాలు ఇవ్వలేదు. గడువు ముగిసినా చాలామంది అభ్యర్థులు ఖర్చుల వివరాలు సమర్పించకపోవడం గమనార్హం.
నిర్దేశిత గడువులోగా ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించని అభ్యర్థులపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ చట్టం ప్రకారం లెక్కలు చూపని వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు అనర్హులుగా ప్రకటించే అధికారం కూడా ఎన్నికల సంఘానికి ఉంటుంది.
బల్దియా వార్డులు అభ్యర్థులు లెక్కలు సమర్పించినవారు సమర్పించనివారు
కామారెడ్డి 49 254 123 131
బాన్సువాడ 19 85 60 25
ఎల్లారెడ్డి 12 45 32 13
బిచ్కుంద 12 63 57 06
మొత్తం 92 447 272 175


