● ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దాతృత్వం
● రూ. 4 కోట్లతో 6 వేల డెస్క్‌లు..
● 4 నుంచి పంపిణీకి ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తరగతి గదిలో కూర్చునేందుకు బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన డ్యుయల్ డెస్క్‌లు అందించేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముందుకు వచ్చారు. తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన కేపీ రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని 18 వేల మంది విద్యార్థులకు అవసరమైన 6 వేల డ్యుయల్ డెస్క్‌లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 4 నుంచి అన్ని పాఠశాలలకు అందించనున్నట్టు ఎమ్మెల్యే ‘సాక్షి’తో తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు కస్తూర్బా, గురుకుల పాఠశాలలకు కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 6 వేల డ్యుయల్ డెస్క్‌ల తయారీకి దాదాపు రూ. 4 కోట్లు ఖర్చవుతున్నాయని తెలిపారు.
మౌలిక సదుపాయాలపై దృష్టి..
కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెంకటరమణారెడ్డి పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. చాలా చోట్ల విద్యార్థులు నేలపై కూర్చుండడాన్ని చూసిన ఆయన వారికి బెంచీలు అందించాలని నిర్ణయించారు. రూ. 4 కోట్లతో 6 వేల బెంచీలను తయారు చేయిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా డెస్క్‌లు రెడీ అయ్యాయి. రోజూ కొన్ని స్కూళ్లకు అందజేయనున్నారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుందనే ఉద్దేశంతో తాను మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈనెల 4 నుంచి డ్యుయల్ డెస్క్‌లను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.


