పల్లెపోరుకు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

పల్లెపోరుకు వేళాయె!

Nov 27 2025 6:48 AM | Updated on Nov 27 2025 6:48 AM

పల్లెపోరుకు వేళాయె!

పల్లెపోరుకు వేళాయె!

పల్లెపోరుకు వేళాయె!

పంచాయతీ ఎన్నికలకు వేళయ్యింది. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి విడత ఎన్నికలు నిర్వహించే గ్రామాలలో గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఆయా పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

పంచాయతీ ఎన్నికల సందడి మొదలయ్యింది. తొలివిడతకు సంబంధించి గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్లను పరిశీలించి అదే రోజు సక్రమమైన నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. నామినేషన్లపై అప్పీల్‌కు డిసెంబర్‌ 1 వరకు అవకాశం ఉంటుంది. 3 న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవడానికి గడువుంది. అదే రోజు సాయంత్ర బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్‌ జరుగనుంది.

ముఖ్య నేతలకు సవాలే..

పంచాయతీ ఎన్నికలు ప్రధాన పార్టీల ముఖ్య నేతలకు సవాల్‌గా మారాయి. మెజారిటీ గ్రామాల్లో తమ పార్టీ నాయకులు గెలవాలన్న పట్టుదలతో ఆయా పార్టీల ముఖ్య నేతలు ప్రణాళికలు రూపొందించారు. కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఎన్నికల కోడ్‌ రాకముందే మహిళలకు ఇందిరమ్మ చీరలతో పాటు వడ్డీ రాయితీ సొమ్ము పంపిణీ చేసింది. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ స్థానికంగా ఉండి గ్రామాల వారీగా పోటీ చేయడానికి రెడీగా ఉన్న వారి జాబితాలు రూపొందించారు. నేతలతో మాట్లాడి మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా ప్రయత్నించాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్‌కు బలమైన క్యాడర్‌ ఉంది. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. పల్లెల్లో పాగా వేయాలన్న పట్టుదలతో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఊరూరా తిరుగుతూ కుల సంఘాలకు సంబంధించి సొంత నిధులతో పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు వారం రోజులపాటు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, చీరల పంపిణీ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెలచుకుని సత్తా చాటాలనే ప్రయత్నంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ పార్టీ నేతలతో సంప్రదిస్తూ ఏ ఊర్లో ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ వచ్చింది, అక్కడ తమ పార్టీకి చెందిన నేతలెవరు పోటీ చేస్తే గెలుస్తారన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని పది మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయం వేడెక్కింది.

కామారెడ్డి డివిజన్‌లోని భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్‌, తాడ్వాయి మండలాల పరిధిలోని 167 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులతో పాటు 1,520 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్లను 62 క్లస్టర్లలో స్వీకరించనున్నారు. పోలింగ్‌ కోసం 1,533 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 2,033 మంది పోలింగ్‌ అధికారులు, సిబ్బందిని నియమించారు. 2,034 బ్యాలెట్‌ బాక్సులతో పాటు బ్యాలెట్‌ పేపర్లను సిద్ధం చేశారు. మండల కేంద్రాల్లో బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్ల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 153 పోలింగ్‌ కేంద్రాలు క్రిటికల్‌, 164 సెన్సిటివ్‌ కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

తొలివిడతలో 167

పంచాయతీలకు ఎన్నికలు

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ

62 క్లస్టర్లలో నామినేషన్ల

స్వీకరణకు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement