నియమావళిని అమలు చేయాలి
కామారెడ్డి క్రైం: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అధికారులకు సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోకి నగదు, మద్యం, ఇతర వస్తువులు అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల ప్రకారం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెడుతున్నామని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు తెలిసినా డయల్ 100 కు గానీ, పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 87126 86133 కు గానీ సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ 99087 12421 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


