‘2.89 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తాం’
కామారెడ్డి క్రైం: జిల్లాలోని 805 చెరువుల్లో ఈ ఏడాది 2.89 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. సోమవారం సాయంత్రం హైదారాబాద్ నుంచి మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మత్స్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్‌లతో కలసి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువులలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ విక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో చేప పిల్లల పంపిణీ లక్ష్యాన్ని ఈనెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.


