సన్నద్ధం
నాలుగేళ్లకోసారి గణన
వన్యప్రాణుల గణనకు
● ఎలా లెక్కించాలన్న అంశంపై శిక్షణ
● వచ్చేనెలలో ప్రారంభం
కానున్న గణన
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పులులతో పాటు ఇతర వన్యప్రాణులను లెక్కించేందుకు అటవీశాఖ సన్నద్ధమైంది. దేశవ్యాప్తంగా పులులు, ఇతర వన్య ప్రాణులను లెక్కించనున్నారు. పెద్దపులులు, చిరుతలు, జింకలు, తోడేళ్లు, దుప్పులు వంటి వన్యప్రాణులు ఎన్ని ఉన్నాయో లెక్కించనున్నారు. వచ్చే నెలలో వన్యప్రాణుల గణన మొదలవనుంది. ఇందుకోసం సోమవారం కామారెడ్డి జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వన్యప్రాణుల గణనపై శిక్షణ ఇచ్చారు. రాజన్న అటవీ సర్కిల్ పరిధిలోని అటవీ శాఖ అధికారులు శిక్షణలో పాల్గొన్నారు. పులులు, ఇతర వన్యప్రాణుల గణనలో అనుసరించాల్సిన పద్ధతులు, మెలకువలపై కామారెడ్డి జిల్లా అటవీ అధికారి బి.నిఖిత, కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాలకు చెందిన వన్యప్రాణి నిపుణులు ఎల్లం, బాపురెడ్డి శిక్షణ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో కూడా ఎలా గణన జరపాలన్న దానిపై అవగాహన కల్పించారు. బాన్సువాడ రేంజ్ అధికారి సునీత, రాజన్న అటవీ సర్కిల్‌కు చెందిన రేంజ్ అధికారులు రమేశ్, సందీప్, హబీబ్, చరణ్, వాసుదేవ్, హిమచందన, రవికమార్, సర్కిల్ పరిధిలోని డిప్యూటీ రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన ఫారెస్ట్రీ విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లాలో పెద్దపులి ఉందా...
కొన్నాళ్ల క్రితం జిల్లాలో పెద్దపులి అడుగులను గుర్తించి, దాని ఆచూకీ కోసం పక్షం రోజుల పాటు అటవీ అధికారులు, సిబ్బంది గాలించారు. అయినా పులికి సంబంధించిన ఆధారాలు లభించలేదు. జిల్లాలో చిరుతలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. కవ్వాల్ ప్రాంతం నుంచి పెద్దపులి వివిధ ప్రాంతాలలో తిరిగిందని చెబుతున్నారు. ఆ పులి ఎటు వెళ్లింది అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఈసారి పులుల గణనతో పాటు వన్యప్రాణుల గణనను చేపట్టనుండడంతో వాటి లెక్క తేలనుంది. అసలు జిల్లాలో ఏయే రకాల వన్యప్రాణులున్నాయి, ఎన్ని ఉన్నాయో అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా లెక్క తేల్చనున్నారు.
2006 సంవత్సరం నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి పులులతో పాటు వన్యప్రాణుల గణన చేపడతున్నారు. ఇప్పటిదాకా ఐదుసార్లు గణన జరిగింది. ఆరోసారి జరుగుతున్న గణనపై అటవీ శాఖ అధికారులు అధికారులు, సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా గణన ఎలా చేపట్టాలన్న దానిపై వివిధ రకాల శిక్షణలు ఇస్తున్నారు. సాంకేతిక అంశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, క్షేత్ర స్థాయిలో ఎలా పరిశీలన జరిపి గణించాలన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. అటవీ అధికారులు, సిబ్బందితో పాటు ఫారెస్ట్రీ కోర్సు విద్యార్థులను ఈ సర్వేలో భాగం చేస్తున్నారు. ఈ గణనను ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్–2026 గా పేర్కొంటారు. పులులు, వన్యప్రాణుల లెక్క తేల్చిన తరువాత వాటి సంరక్షణ కోసం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తారు. వచ్చే నెలలో గణన మొదలై మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయనున్నారు.
సన్నద్ధం


