కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలి
● జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
● మద్నూర్‌లో పత్తి కొనుగోలు
కేంద్రం ప్రారంభం
మద్నూర్: రైతులు కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు. మండల కేంద్రంలోని కృష్ణ జిన్నింగ్ మిల్లులో సోమవారం సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్ ముగిసే వరకు పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయన్నారు. ఈ జిల్లాకు సంబంధించిన పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధనపై జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్‌లతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఎక్కువ పత్తి లేదన్నారు. పొరుగు జిల్లాలకు చెందిన రైతులు ఏటా ఇక్కడికి పత్తిని తీసుకువస్తారని పేర్కొన్నారు. పక్క జిల్లాలకు చెందిన పత్తిని తీసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని వినతి పత్రం అందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకు ముందు డోంగ్లీ మండల కేంద్రంలో సొసైటీ నూతన భవనాన్ని, రేషన్ దుకాణంలో రేషన్‌తో పాటు ప్రత్యేకంగా అందిస్తున్న 5 కేజీల సంచులను, ధోతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సౌజన్య, వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, నాయకులు సాయిలు, రాంపటేల్, హన్మండ్లు స్వామి, శీనుపటేల్, రమేశ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


