పెద్ద డ్రయ్యర్లు తెప్పించాలి
● వర్షాలతో ఇబ్బందిపడుతున్న అన్నదాతలు
● తడిసిన ధాన్యాన్ని కొనాలని వినతి
బాన్సువాడ : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందిపడుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో త్వరగా తూకాలు పూర్తి చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో ధాన్యం సేకరణ కోసం 427 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్నది లక్ష్యం. అయితే ఇప్పటికీ చాలాచోట్ల కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం 260 కొనుగోలు కేంద్రాల్లోనే కాంటాలు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు ఆయా కేంద్రాల ద్వారా 50,139 మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేశారు.
‘తేమ’తో ఇబ్బంది..
వర్షాలతో అన్నదాతలు ఇబ్బందిపడుతున్నారు. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వడ్లు తడిసిపోతున్నాయి. దీంతో నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం రావడం లేదు. తరచూ వర్షం కురుస్తుండడంతో వడ్లు తడుస్తున్నాయని, ఎంత ఆరబెట్టినా తేమశాతం 20 శాతానికిపైనే వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల తేమ శాతం రాకపోవడంతో, మరికొన్ని చోట్ల వర్షాల కారణంగా కోతలు ఆలస్యం అవుతుండడంతో కొనుగోళ్లలో వేగం పెరగడం లేదు. బాన్సువాడ మార్కెట్ కమిటీలో అందుబాటులో ఉన్న ఒక్క డ్రయ్యర్ రోజుకు ఒకరిద్దరు రైతుల ధాన్యాన్ని ఆరబెట్టేందుకే సరిపోతోంది. బీర్కూర్ మార్కెట్ కమిటీలో డ్రయ్యర్ మిషనే లేదు. అధికారులు స్పందించి ధాన్యాన్ని ఎండబెట్టేందుకు అవసరమైన డ్రయ్యర్లను తెప్పించాలని రైతులు కోరుతున్నారు.
ఎండ రావడంతో వడ్లను మార్కెట్ కమిటీలో ఆరబెట్టాను. అయితే అకస్మాత్తుగా వర్షం రావడంతో వడ్లు తడిసిపోయాయి. ఏం చేయాలో తోచడం లేదు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. పెద్ద డ్రయ్యర్‌లు తెప్పిస్తే త్వరగా ఆరబెట్టడానికి అవకాశం ఉంటుంది.
– కుర్మ సాయిలు, రైతు, బాన్సువాడ
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం


