బడుల బలోపేతానికి తనిఖీ బృందాలు
సభ్యుల ఎంపిక ఇలా..
● వంద పాఠశాలలకో కమిటీ
● జిల్లాలో 12 కమిటీల ఏర్పాటుకు
విద్యాశాఖ కసరత్తు
కామారెడ్డి టౌన్: సర్కారు బడులను బలోపేతం చేయడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పాఠశాలల తనిఖీలు, పర్యవేక్షణ ద్వారా విద్య నాణ్యతను మెరుగు పరచడం కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసేందుకు డీఈవో, ఎంఈవోలు ఉన్నారు. అయితే పర్యవేక్షణ, తనిఖీలుకు వీరు సరిపోవడం లేదన్న ఉద్దేశంతో మెరుగైన పర్యవేక్షణ నిమిత్తం టీచర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత నెలలలో ఇందుకు సంబంధించి జీవో జారీ అయిన నేపథ్యంలో కమిటీల ఏర్పాటు కోసం జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
మూడు విధాలుగా..
టీచర్ల కమిటీలను మూడు విధాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిలో వంద బడులకు ఒక కమిటీని ఏర్పాటు చేయనుండగా.. ఉన్నత పాఠశాలల్లో 50 స్కూళ్లకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 966 పాఠశాలలుండగా మొత్తం 12 కమిటీలను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 652 ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణ కోసం ఏడు కమిటీలు, 123 ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక కమిటీ, 191 ఉన్నత పాఠశాలలకు నాలుగు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రాథమిక పాఠశాలల తనిఖీలకోసం జిల్లా స్థాయిలో ముగ్గురితో బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. మరో ఇద్దరు సీనియర్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఇందులో ఉంటారు. ప్రాథమికోన్నత పాఠశాలల కమిటీలో స్కూల్ అసిస్టెంట్ టీచర్ నోడల్ అధికారిగా, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, ఒక ఎస్‌జీటీ సభ్యుడిగా ఉంటారు. ఉన్నత పాఠశాల తనిఖీ బృందంలో 9 మంది ఉంటారు. పీజీ హెచ్‌ఎం నోడల్ అధికారిగా, ఏడుగురు సబ్జెక్ట్ టీచర్లతో పాటు ఒక పీఈటీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు తమ పరిధిలోని స్కూళ్లను తనిఖీ చేసి, వివరాలను వారానికోసారి డీఈవోకు వివరించాల్సి ఉంటుంది. ఈ కమిటీలను కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈవో, మరో జిల్లా స్థాయి అధికారి నియమిస్తారు. పదేళ్ల పాటు బోధనానుభవం, సబ్జెక్టులో పాఠ్యంశ ప్రదర్శన, విద్యాశాఖ నిర్వహించిన వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం, చక్కని రాత, భావవ్యక్తీకరణ నైపుణ్యాలతో పాటు కంప్యూటర్, డిజిటల్ ప్రతిభ లాంటి అర్హతలు ఉన్న వారికి కమిటీలలో చోటు కల్పిస్తారు. కమిటీలను నిర్వహించేందుకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను తీసుకుని కలెక్టర్ సమక్షంలో ఈ కమిటీలను నియమిస్తామని డీఈవో రాజు తెలిపారు.


