కొండాపూర్‌.. | - | Sakshi
Sakshi News home page

కొండాపూర్‌..

Oct 12 2025 7:14 AM | Updated on Oct 12 2025 7:14 AM

కొండా

కొండాపూర్‌..

కొండాపూర్‌.. ఆర్గోండ కంచుమల్‌

ఊరి పేర్లకు జతగా పక్క ఊరి పేరు

రెండూళ్ల పేర్లతోనే పిలుస్తరు..

అట్ల పిలిస్తేనే జెల్ది తెల్సిపోతుంది..

ఒక్క పేరుతో ఎన్నో ఊర్లు..

అలా పిలిస్తేనే సులువుగా

తెలుస్తుందంటున్న గ్రామస్తులు

దశాబ్దాలుగా కొనసాగుతున్న వైనం

‘తాతా.. ఏ ఊరే మీది..

మాది ఆర్గొండ కొండాపుర్‌’

‘అవ్వా ఏ ఊరుకు పోవాలె..

శాబ్దిపూర్‌ గూడెంకు బిడ్డా’

‘ఏ ఊరమ్మ మీది.. మాటూర్‌ మాసన్‌పల్లి’

‘మీదేవూరు తమ్మీ.. కంచుమల్‌ కొండాపూర్‌’.... జిల్లాలో కొన్ని ఊర్ల పేర్లకు జతగా పొరుగూరు పేరును కలిపి పిలుస్తారు. అట్లా పిలిస్తేనే సులువుగా వాళ్లది ఆ ఊరు అని అర్థమవుతుంది. దశాబ్దాల కాలంగా అలాగే పిలుస్తుంటారు. పాతతరం వాళ్లే కాదు ఇప్పటివాళ్లు కూడా వాళ్ల ఊరు పేరు అడిగితే కూడా జతగానే చెబుతారు. అలా చెబితేనే అందరికీ సులువుగా అర్థమవుతుంది.

ఒక పేరుతో నాలుగైదు గ్రామాలు...

కొన్ని గ్రామాల పేర్లతో నాలుగైదు గ్రామాలున్నాయి. కొండాపూర్‌ అనే పేరుతో కామారెడ్డి జిల్లాలోనే ఐదారు గ్రామాలుంటాయి. దీంతో ఆ ఊరు పేరు చెబితే ఎవరైన మళ్లీ ఎక్కడ అని అడుగుతారు. జతగా పక్క ఊరు పేరు కలిపి చెబితే ఆ ఊరా అని అర్థం చేసుకుంటారు. రాజంపేట మండలంలో కొండాపూర్‌ అనే ఊరు, ఆర్గొండ ఊరు పక్కనే ఉంటుంది. దీంతో చాలా మంది ఆర్గొండ కొండాపూర్‌ అంటారు. రికార్డుల్లో కొండాపూర్‌ అని మాత్రమే ఉంటుంది. కానీ ఊరు పేరు త్వరగా అర్థం చేసుకునేలా ‘అర్గొండ కొండాపూర్‌’ అంటారు. అలాగే లింగంపేట మండలంలో కొండాపూర్‌ ఉంది. దాని పక్కనే కంచుమల్‌ అనే ఊరుంటుంది. ఇక్కడ కొండాపూర్‌ను ‘కంచుమల్‌ కొండాపూర్‌’ అని పిలుస్తుంటారు.

అలాగే నాగిరెడ్డిపేట మండలంలో మాసాన్‌పల్లి అనే ఊరుంది. దాని పక్కనే మాటూర్‌ ఉంటుంది. దీంతో ఆ ఊరి పేరును ‘మాటూర్‌ మాసాన్‌పల్లి’ అని పిలుస్తారు. ఇదే మండలంలో వాడి అనే ఊరుంటుంది. దాని పక్కన చీనూర్‌ అనే ఊరు ఉంటుంది. దీంతో వాడి ఊరు పేరు చెప్పడానికి ‘చీనూర్‌ వాడి’ అంటారు. కామారెడ్డి మండలంలో గూడెం అనే ఊరుంటుంది. దానికి ముందే శాబ్దిపూర్‌ అనే ఊరుంది. ఇక్కడ గూడెం పేరును ‘శాబ్దిపూర్‌ గూడెం’ అంటారు. తాడ్వాయి మండలంలో సంతాయిపేట ఊరు, చిట్యాల ఊరు పక్కనే ఉంటుంది. దాన్ని చిట్యాల సంతాయిపేట అని పిలుస్తారు. ఇదే మండలంలో కన్కల్‌ అనే ఊరుకు ముందు దేమె అనే ఊరుంటుంది. ఇక్కడ ఊరి పేరును దేమె కన్కల్‌ అంటారు. రామారెడ్డి మండలంలో మద్దికుంట అనే ఊరుంటుంది. పక్కనే రెడ్డిపేట ఉంటుంది. చాలా మంది రెడ్డిపేట మద్దికుంట అంటుంటారు. పొరుగునే నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలో కొండాపూర్‌ ఉంటుంది. దాని పక్కనే తూంపల్లి అనే ఊరుంది. చాలా మంది తూంపల్లి కొండాపూర్‌ అంటారు. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌ (ఎం) గ్రామాన్ని మాచారెడ్డి ఘన్‌పూర్‌ అంటుంటే, రామారెడ్డి మండలంలోని ఘన్‌పూర్‌(ఆర్‌)ను రెడ్డిపేట ఘన్‌పూర్‌ అంటారు. కామా రెడ్డి మండలంలో తిమ్మక్‌పల్లి పేరుతో రెండు గ్రామాలున్నాయి. గర్గుల్‌కు సమీపంలో ఉన్న తిమ్మక్‌పల్లి గ్రామాన్ని గర్గుల్‌ తిమ్మక్‌పల్లి అంటారు. వాస్తవంగా తిమ్మక్‌పల్లి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. తిమ్మక్‌పల్లి(జి) అని కూడా అంటుంటారు. అలాగే మరో తిమ్మక్‌పల్లిని తిమ్మక్‌పల్లి (కే) అంటారు. కామారెడ్డి తిమ్మక్‌పల్లి అని చెబుతారు. ఇలా ఊరు పక్కన ఉన్న ఊరు పేరుతో కలిపి పిలవడం వల్ల ఆ ఊరు ఎక్కడుంటుందో తెలిసిపోతుంది.

మాది నాగిరెడ్డిపేట మండలంలోని మాసాన్‌పల్లి. మా ఊరు పక్కన మాటూర్‌ ఉంటుంది. మొదటి నుంచి మాటూర్‌ మాసాన్‌పల్లి అని పలుకుతారు. మాసాన్‌పల్లి పంచాయతీలో మాటూర్‌ ఉండేది. ఆ మద్యనే మాటూర్‌ వేరు పంచాయతీగా ఏర్పాటైంది. రెండూళ్ల పేర్లను తాతల కాలం నుంచి కలిసే పిలుస్తుంటారు.

– బండారి బాబాగౌడ్‌, మాసాన్‌పల్లి,

నాగిరెడ్డిపేట మండలం

మా ఊరు కొండాపూర్‌. కొండాపూర్‌ అంటే ఏ కొండాపూర్‌ అని, ఎక్కడుంటది అని అడిగేవాళ్లుంటారు. అందుకే ఆర్గొండ కొండాపూర్‌ అని చెబుతుంటాం. మా ఊరు వాళ్లే కాదు. పొరుగూళ్ల వాళ్లు కూడా ఆర్గొండ కొండాపూర్‌ అనే పిలుస్తారు. ఇట్లా పిల్వడం వలన సులువుగా అర్థమవుతుంది.

– గొల్ల లచ్చయ్య, కొండాపూర్‌,

రాజంపేట మండలం

మా ఊరు లింగంపేట మండలంలోని కొండాపూర్‌. మా ఊరు పేరుతో జిల్లాలో, పక్క జిల్లాలో కూడా ఉన్నాయి. మా ఊరుకు పక్కనే కంచుమల్‌ ఉంది. అందుకే కంచుమల్‌ కొండాపూర్‌ అనే పేరు వాడుకలో ఉంది. వేర్వేరు గ్రామాలు, వేర్వేరు పంచాయతీలు అయినా సులువుగా తెలిసేలా పిలుస్తారు.

– బట్టు కాశీరాం, కొండాపూర్‌,

లింగంపేట మండలం

కొండాపూర్‌..1
1/3

కొండాపూర్‌..

కొండాపూర్‌..2
2/3

కొండాపూర్‌..

కొండాపూర్‌..3
3/3

కొండాపూర్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement