
ఆర్టీసీ డ్రైవర్లకు మొబైల్ నిషేధం
ఖలీల్‌వాడి: తెలంగాణ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తూనే.. మరోవైపు ప్రయాణికుల మన్ననలను పొందేందుకు అన్నిరకాల అవకాశాలను ఉపయోగించుకుంటోంది. ఆర్టీసీ ప్రమాదాల నివారణకు ఇటీవల డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తాజాగా బస్సు డ్రైవర్లకు సెల్‌ఫోన్ వాడకం నిషేధించింది. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి కామారెడ్డి డిపోలో ఈ విధానం అమలు చేస్తోంది. ఈ మేరకు డిపోలోని డ్రైవర్లు సెల్‌ఫోన్ లేకుండా బస్సుల్లో విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవింగ్ సీటులోకి వెళ్లే ముందు డ్రైవర్లు అంతా తమ సెల్‌ఫోన్లను డిపో సెక్యూరిటీకి అందజేస్తున్నారు. గతంలో పలువురు డ్రైవర్లు విధుల్లో సెల్‌ఫోన్ వినియోగిస్తున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సఫలీకృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో అమలు చేయనున్నట్లు సమాచారం.
నిజామాబాద్ రీజియన్‌లో డిపోలు 6
పనిచేస్తున్న డ్రైవర్లు 795
సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంత కాలం జరిగిన ప్రమాదాలకు కారణాలను విశ్లేషిస్తూనే మరోసారి జరగకుండా చర్యలు చేపడుతున్నాం. ఈ విధానంలో ఏమైనా మార్పులు, సమస్యలుంటే తొలుత గుర్తిస్తాం. దశల వారీగా అన్ని డిపోల్లో అమలు చేస్తాం.
– జ్యోత్స్న, ఆర్‌ఎం, నిజామాబాద్ రీజియన్
కామారెడ్డి డిపోలో
అమలవుతున్న విధానం
విధులకు ముందే ఫోన్ల డిపాజిట్
ప్రమాదాల నివారణకు కృషి