
‘కౌలాస్’కు రికార్డుస్థాయి వరద
● పదిహేనేళ్లలో మొదటిసారి
ఇన్‌ఫ్లోగా 9.75 టీఎంసీల నీరు
● అవుట్‌ఫ్లో 9.135 టీఎంసీలు
నిజాంసాగర్(జుక్కల్): జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న కౌలాస్ ప్రాజెక్టు పదిహేనేళ్లల్లో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చింది. 2011 సంవత్సరం నుంచి కౌలాస్ ప్రాజెక్టు రికార్డుల ప్రకారంగా ఈ యేడాది అత్యధికంగా 9.75 టీఎంసీల వరద నీరు ఇన్‌ఫ్లో రాగా 9.135 టీఎంసీల నీటిని వరద గేట్ల ద్వారా దిగువనకు విడుదల చేశారు.
ఆగస్టులో అత్యధిక ఇన్‌ఫ్లో..
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కుండపోతగా కురిసిన వర్షాలకు ఈ యేడాది ఆగస్టు 28న కౌలాస్ ప్రాజెక్టులోకి అత్యధికంగా 31,456 క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కౌలాస్ ప్రాజెక్టు చరిత్రలో 30 వేలకు పైగా క్యూసెక్కుల వరద నీరు ఒక్కరోజులో రావడం రికార్డు అని అధికారులు పేర్కొంటున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో ఆగస్టు 17 నుంచి కౌలాస్ ప్రాజెక్టు గేట్ల ద్వారా మంజీరా నదిలోకి నీటి విడుదల కొనసాగుతుంది. యాబై రోజుల నుంచి కౌలాస్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో రావడంతో ఇప్పటి వరకు 9.135 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి కౌలాస్ ప్రాజెక్టులోకి 287 క్యూసెక్కుల వరద నీరు శనివారం ఇన్‌ఫ్లోగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయినీటిమట్టం 458 మీటర్లు(1.237 టీఎంసీల)కు గాను ప్రస్తుతం 457.98 మీటర్లు (1.232 టీఎంసీల) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.