
బంగారంపైనే దొంగల నజర్
ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచరాదు..
పది రోజుల క్రితం సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలోని నాలుగిళ్లలో ఒకే రోజు చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడిన దొంగలు అందినకాడికి బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.
గత నెల 19న బాన్సువాడ మండలం తెల్లాపూర్ గ్రామానికి చెందిన మేడిపల్లి లక్ష్మీ అనే మహిళను బెదిరించి ఆమె వద్దనున్న అరతులం బంగారం, రూ.50 వేలను దుండగుడు దోచుకెళ్లాడు.
జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో ఇటీవల రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలోంచి 3 తులాల బంగారం గొలుసును లాక్కుని పరారయ్యారు. రెండు రోజుల తర్వాత
పోలీసులు వారిని పట్టుకున్నారు.
జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో రెండు రోజుల క్రితం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. శ్రీశైలం అనే వ్యక్తి ఇంటికి తాళం ఉండటంతో, దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి 3.5 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.2.50 లక్షల నగదు దోచుకెళ్లారు. పక్కనే ఉన్న మరో ఇంటి తాళం కూడా పగులగొట్టి చోరీకి
యత్నించారు.
కామారెడ్డి క్రైం: బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండగా, వెండి భూమ్మీద ఉండనంటోంది. దీంతో ప్రస్తుతం చాలా మంది సామాన్య ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి ఆర్ధికంగా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో బంగారం గనుక చోరీకి గురైతే పెద్ద షాక్ తగిలినట్లే. ధరలు భారీగా పెరిగిన వేళ దొంగల నజర్ బంగారం, వెండిపై మరింతగా పెరగడం కూడా సహజమే. తాళం వేసిన ఇండ్లు, ఒంటరిగా కనిపించే మహిళలను టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్న పలు ఘటనలు ఇటీవల జిల్లాలో వెలుగుచూడటమే ఇందుకు ఉదాహరణ. కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది.
చైన్ స్నాచింగ్‌కు గురికాకుండా..
ఒంటరిగా ఉండి, ప్రయాణించే మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒంటిపై ఉన్న బంగారాన్ని కాజేసేందుకు సైతం దుండగులు వెనకాడటం లేదు. ప్రయాణాల్లో మహిళలు తమ విలువైన బంగారు ఆభరణాలను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితులున్నాయి. మహిళా ప్ర యాణికుల వద్దనుంచి పర్సులు, బంగారు ఆభరణా లు చోరీకి గురయ్యే ఘటనలు తరచు వెలుగుచూస్తున్నాయి. చోరీల నియంత్రణకు పోలీసు శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించినప్పుడే దొంగతనాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
దొంగతనాల విషయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎవరైన ఇంటికి తాళం వేసి ఊరెళ్తే బంగారం, నగదు లాంటి విలువైన వస్తువులు ఇళ్లలో ఉంచకూడదు. పోలీసు శాఖ సూచనలు పాటించాలి. ఎవరైనా కాలనీల్లో అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే స్థానిక పోలీసులకు గానీ, డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. నేరాల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. – రాజేష్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి
బంగారాన్ని కొనడానికి కష్టపడినట్లే దాన్ని కాపాడుకోవడానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పుడు తులం బంగారమే దాదాపు రూ.1.24 లక్షలుగా ఉంది. దీంతో దుండగులు గోల్డ్ చోరీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టి ఇంటికి తాళం వేసి ఊరెళ్లే వారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంట్లో బంగారం, నగదు ఉంచి, కొద్దిసేపటికే వస్తాం కదా అనే నిర్లక్ష్య ధోరణిలో బయటకు వెళ్తున్నారు. గతంలో ఇంట్లో దొంగలు పడితే చాలా రకాల వస్తువులు దోచుకువెళ్లేవారు. కొంతకాలంగా కేవలం బంగారం, వెండి, నగదు మాత్రమే చోరీ చేస్తున్నారు. తిరిగి వచ్చేసరికి అవన్నీ దొంగలపాలవుతున్న ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అందుకే ఊర్లకు వెళ్లే వారు ఇంట్లో బంగారం, నగదు ఉంచకూడదనీ, బ్యాంకులో గానీ, దగ్గరి బంధువుల వద్దగాని పెట్టుకొని వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
ధరలు పెరుగుతుండటంతో
వాటి చోరీకే ప్రాధాన్యం
తాళం వేసిన ఇండ్లు, ఒంటరిగా
కనిపించే మహిళలే టార్గెట్
అప్రమత్తంగా ఉండాలంటున్న
పోలీసులు

బంగారంపైనే దొంగల నజర్

బంగారంపైనే దొంగల నజర్