
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి టౌన్: విదేశీ విద్యా విధానం అధ్యయనం కోసం ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజు ఒక ప్రకటనలో తెలిపారు. సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్ దేశాలలో విద్యా విధానం అధ్యయనం కోసం వెళ్లడానికి అనుభవం, అర్హతలు ఉన్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూల్, టీజీఆర్‌ఈఐఎస్‌లలో 10 ఏళ్ల బోధన అనుభవం, 55 ఏళ్ల వయస్సులోపు, వాలిడ్ పాస్‌పోర్టు కలిగిన ఉపాధ్యాయులు అర్హులన్నారు. కలెక్టర్, జిల్లా సెక్షన్ కమిటీ సమక్షంలో ఎంపిక ఉంటుందన్నారు. రాష్ట్ర రిసోర్స్ పర్సన్‌గా, పాఠ్య పుస్తక రచన అనుభవం, వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనుభవం కలిగిన వారు రుజువులతోపాటు, దరఖాస్తులను ఈ నెల 14న సాయంత్రం 4 గంటల లోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
కామారెడ్డి రూరల్: కామారెడ్డి జిల్లాలోని మద్యం దుకాణాలకు గాను శనివారం నాటికి 106 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 49 దుకాణాలుండగా 5 ఎస్సీ, 2 ఎస్టీ, 7 గౌడ సామాజిక వర్గాలకు కేటాయించారు. ఓపెన్ కేటగిరి కింద 35 దుకాణాలున్నాయి. ఈ నెల 18 వరకు కొత్త టెండర్లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ నెల 23న లక్కి డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనివారం వచ్చిన 18 దరఖాస్తులతో కలిపి ఇప్పటి వరకు ఆయా దుకాణాలకు 106 దరఖాస్తులు వచ్చాయని ఈఎస్ తెలిపారు. వాటిలో కామారెడ్డి స్టేషన్ పరిధిలో 15 దుకాణాలకు 27 దరఖాస్తులు వచ్చాయని, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 దుకాణాలకు 10 దరఖాస్తులు, బాన్సువాడ స్టేషన్ పరిధిలో 9 దుకాణాలకు 28 దరాఖాస్తులు, దోమకొండ స్టేషన్ పరిధిలో 8 దుకాణాలకు 13 దరఖాస్తులు, బిచ్కుంద స్టేషన్ పరిధిలో 10 దుకాణాలకు 28 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
కామారెడ్డి టౌన్: ఆరోగ్యశ్రీ పథకంలో విధులు నిర్వహిస్తున్న తమను అర్ధంతరంగా తొలగించడం సరికాదని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆరోగ్యశ్రీ పథకం కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బంది డిమాండ్ చేశారు. ఈమేరకు వారు శనివారం కామారెడ్డి జీజీహెచ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో 10 ఏళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న తమను ఆరోగ్యశ్రీలో నిధులు లేవని అసత్యపు కారణంతో ఉద్యోగాల నుంచి తొలగించడం సిగ్గుచేటన్నారు. దీంతో 13 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఆన్‌లైన్ సేవలు పూర్తిస్థాయిలో జరగడం లేవన్నారు. తక్షణమే తమను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. ఈ అన్యాయంపై ఉన్నతాధికారులను కలుస్తామని, అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తామని తెలిపారు. ఇమ్రాన్, గౌతమ్, అమీన్, సాయికుమార్, నర్సింలు, హరికుమార్, స్వరూప, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.