
మత్తు వదిలిస్తుండ్రు..
● మందుబాబులు డ్రంకన్‌డ్రైవ్‌లో దొరికితే అంతే..
● జిల్లావ్యాప్తంగా
పోలీసుల విస్తృత
తనిఖీలు
● రెండు రోజుల్లోనే
100 మంది జైలుకు..
మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తున్న మందుబాబుల మత్తును పోలీసులు వదిలిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా తరచూ డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేపడుతూ మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొని, అరెస్టు చేస్తున్నారు. కోర్టులు సైతం వారికి రోజుల తరబడి జైలు శిక్షలు విధించడంతోపాటు, కమ్యూనిటీ శిక్షలు విధిస్తున్నాయి.
ఇటీవల జిల్లా కేంద్రంలో మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తిని పట్టణ పోలీసులు పట్టుకొని, కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతడికి ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ శిక్షను విధించింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ‘నేను మద్యం తాగి వాహనం నడిపినందుకు కోర్టు నాకు ఒక రోజు కమ్యూనిటీ శిక్ష విధించిందనీ, మద్యం సేవించి వాహనం నడపవద్దని’ ఫ్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు.
కామారెడ్డి క్రైం: జిల్లా పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ విషయంలో కొరడా జులిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతుండటంతో మద్యం తాగి వాహనాలు నడుతున్నవారు భారీగా పట్టుబడుతున్నారు. ఈక్రమంలో డ్రంకన్‌డ్రైవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు కోర్టు శిక్షలు, జరిమానాలు విధించడం కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.
జిల్లాలో 23 పోలీస్ స్టేషన్లు..
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 23 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నిత్యం వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా డ్రంకన్‌డ్రైవ్‌పై పోలీస్ శాఖ ఫోకస్ చేస్తోంది. ప్రతినెల వేల సంఖ్యలో కేసులు జిల్లాలోని ఆయా కోర్టులకు వెళ్తున్నాయి. వాటిలో వందల సంఖ్యలో జైలు శిక్షలు పడుతున్నాయి. గత రెండు రోజుల వ్యవధిలోనే జిల్లాలోని ఆయా కోర్టుల పరిధిలో 100 మందికి జైలు శిక్షలు, జరిమానాలు విధించబడడమే ఇందుకు ఉదాహరణ. గత నెల 19న ఒకే రోజు 33 మందికి ఒకటి నుంచి రెండు రోజుల జైలు శిక్ష, జరిమానాలు పడ్డాయి. ఈనెల 9న జిల్లా వ్యాప్తంగా 58 మందికి జైలు శిక్షలు, జరిమానాలు విధించబడ్డాయి. తాజాగా శుక్రవారం జిల్లాలోని ఆయా కోర్టుల పరిధిలో డ్రంకన్‌డ్రైవ్‌లో పట్టుబడిన 42 మందికి జైలు శిక్ష, జరిమానాలు విధించారు. పోలీసులు డ్రంకన్‌డ్రైవ్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నారు. కాబట్టి వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడిపే విషయంలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మత్తు వదిలిస్తుండ్రు..