
ఉద్యానక్షేత్రంపై అంతులేని నిర్లక్ష్యం
పొదలను తొలగింపజేస్తాం..
● నిధులు, సిబ్బంది కొరతతో
నిర్వహణకు ఆటంకం
● పట్టించుకునేవారు లేక పండ్ల తోటల్లో
దట్టంగా పెరిగిన పిచ్చిమొక్కలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఒకప్పుడు వివిధ రకాల పండ్లతోటలతో, పూలమొక్కలతో కళకళలాడిన నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రం ప్రస్తుతం పట్టించుకునేవారు లేక పిచ్చిమొక్కలతోపాటు గడ్డి దట్టంగా పెరిగి అధ్వానంగా మారింది. నిధుల కేటాయింపు లేకపోవడం, సిబ్బంది కొరత కారణంగా ఉద్యానక్షేత్రం నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. గత నాలుగు నెలల వరకు కొనసాగిన మాల్తుమ్మెద ఉద్యానక్షేత్ర అధికారి బదిలీపై వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకోస్తున్నారు. ఫలితంగా ఉద్యాన క్షేత్రంలోని పండ్లతోటలతోపాటు దారులు సైతం పిచ్చిమొక్కలు, గడ్డితో నిండిపోయాయి. పిచ్చిమొక్కలు, గడ్డి కారణంగా పండ్లచెట్ల ఎదుగులకు ఆటంకం కలుగుతుంది.
నిలిచిన మొక్కల ఉత్పత్తి..
ఉద్యానక్షేత్రంలో కొన్నిరోజులుగా మొక్కల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. క్షేత్రంలోని నీటిలో సరైన పోషకాలు లేకపోవడం, నేలస్వభావం మొక్కల ఉత్పత్తికి అనుకూలంగా లేవని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఉద్యానక్షేత్రం ఎదుట ఉన్న విత్తనోత్పత్తిక్షేత్రం నుంచి కొంతకాలంపాటు పైపుల ద్వారా నీటిని ఇక్కడికి తీసుకువచ్చి మొక్కలను ఉత్పత్తి చేసినప్పటికీ ప్రస్తుతం అది కూడ పూర్తిగా నిలిచిపోయింది.
‘ఉపాధి’తో తొలగింపునకు సిఫారసు..
ఉపాధిహామీ పథకం ద్వారా ఉద్యానక్షేత్రంలో దట్టంగా పెరిగిన పొదలను, పిచ్చిమొక్కలను తొలగింపజేసేందుకు ఉద్యానశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. ఈమేరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు అధికారులు లేఖ రాసినట్లు తెలిసింది. కూలీలతో కాకుండా కేవలం యంత్రాల సహాయంతో పొదల తొలగింపు చేపట్టే అవకాశం ఉంది.
అడవిపందుల బెడద..
దట్టంగా పెరిగిన పొదల్లో అడవిపందులు సహవాసం చేస్తున్నాయి. అడవిపందులు గుంపులు గుంపులుగా సంచరిస్తుండటంతో క్షేత్ర సిబ్బంది భయాందోళనకు గురిచేస్తున్నాయి. క్షేత్రంలోని దారుల వెంట వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. దీనికితోడు చిన్న నిప్పురవ్వ పడినా ఉద్యానక్షేత్రం బుగ్గిపాలయ్యేలా గడ్డి, పొదలు, పిచ్చిమొక్కలు దట్టంగా పెరిగాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యానక్షేత్ర అభివృద్ధికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రంలో కొత్త మొక్కల ఉత్పత్తి జరగకపోవడానికి కారణం నేలస్వభావం, నీటిలో నాణ్యత లేకపోవడమే. కాగా ఉద్యాన క్షేత్రంలో దట్టంగా పెరిగిన పొదల్లో అడవిపందులు సంచరిస్తున్నాయి. పెరిగిన పొదలను ఉపాధిహామీ పథకం ద్వారా తొలగింపజేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
– జ్యోతి, జిల్లా ఉద్యానశాఖ అధికారిణి, కామారెడ్డి

ఉద్యానక్షేత్రంపై అంతులేని నిర్లక్ష్యం