
నత్తనడకన హైవే బ్రిడ్జి మరమ్మతులు
● గాయత్రి షుగర్స్ వద్ద వంతెనపై
నిలిపివేసిన రాకపోకలు
● సర్వీస్ రోడ్డుపై వాహనాల మళ్లింపు
● ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పరిధిలోగల గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ వద్ద 44వ జాతీయ రహదారి బ్రిడ్జి మరమ్మతులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో కొన్ని రోజులుగా వాహనాలను సర్వీస్ రోడ్డు గుండా మళ్లించడంతో తరచు ట్రాఫిక్ జామ్ సమస్యతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతకుముందు కొన్ని రోజుల పాటు మర్కల్ చౌరస్తా నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి వరకు వన్‌వేపై వాహనాలను మళ్లించారు. ఇప్పుడేమో బ్రిడ్జిపై మరమ్మతుల పేరిట సర్వీస్ రోడ్డు గుండా వాహనాలను పంపించడం వల్ల వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు రాత్రి వేళలో ప్రయాణం సాగించే వారికి ట్రాఫిక్ జామ్ కావడం వల్ల గంటల తరబడి అంతరాయం ఏర్పడుతోంది. ఈ రహదారి గుండా ప్రతిరోజు వందలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. బ్రిడ్జిపై మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులపై ఉంది. ఇప్పటికై నా ప్రమాదాలు సంభవించకముందే అధికారులు దృష్టిసారించి మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.

నత్తనడకన హైవే బ్రిడ్జి మరమ్మతులు