
‘స్థానిక’ నామినేషన్ల స్వీకరణ
● మండల కేంద్రాల్లో ప్రత్యేక కార్యాలయాల ఏర్పాటు
● తాడ్వాయిలోని కేంద్రాన్ని పరిశీలించిన
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
భిక్కనూరు/బీబీపేట/రాజంపేట/ఎల్లారెడ్డి/తాడ్వాయి/గాంధారి: రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురువారం నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసందర్భంగా జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో అధికారులు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, సిబ్బందిని సిద్ధం చేశారు. కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ ఎంపీటీసీ స్థానానికి కార్తీక్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా భిక్కనూరు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్‌ను ధాఖలు చేశారు. మండలంలో ఎంపీటీసీ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు అయిందని అధికారులు వివరించారు. అలాగే గాంధారి మండల పరిధిలోని సీతాయిపల్లి ఎంపీటీసీ స్థానానికి గ్రామానికి చెందిన సింగసాని పండరి నామినేషన్ దాఖలు చేశారని అధికారులు తెలిపారు. బీబీపేట, రాజంపేట, తాడ్వాయి మండలాల్లో ఎవరూ నామినేషన్లు అందించలేదు. తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ఏటీసీ సెంటర్‌ను తనిఖీ చేశారు. కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి నుంచి ఏటీసీ సెంటర్‌కు వెళ్లే రోడ్డు సరిగా లేకపోవడంతో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలని తహసీల్దార్ శ్వేతను ఆదేశించారు. ఇదిలా ఉండగా సాయంత్రం స్థానిక ఎన్నికలపై హైకోర్డు స్టే విధించిన విషయం విదితమే. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

‘స్థానిక’ నామినేషన్ల స్వీకరణ

‘స్థానిక’ నామినేషన్ల స్వీకరణ