
టేకు చెట్ల చోరీలో ఇద్దరి అరెస్టు
మాక్లూర్: వ్యవసాయ క్షేత్రం నుంచి టేకు చెట్లను కోసి అపహరించుకుపోయిన దొంగలను మాక్లూర్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై రాజశేఖర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 19న మండలంలోని మెట్‌పల్లి–వల్లభాపూర్ గ్రామాల మధ్యలో ఉన్న గోపాల్ శ్రీధర్ వ్యవసాయ క్షేత్రం నుంచి దొంగలు 20 టేకు చెట్లను మిషన్‌తో కోసి దుంగలను ఎత్తుకెళ్లారు. యజమాని శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజశేఖర్ దర్యాప్తు చేపట్టారు. చెట్లను అపహరించిన జావేద్, మహమ్మద్ అబ్బాస్‌లను అరెస్టు చేసి వారి నుంచి రూ. 95 వేల విలువజేసే టేకు కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.