
వరికి ఎండాకు తెగులు
ఎండాకు తెగులు సోకింది
● ఆందోళనలో అన్నదాతలు
● వాతావరణంలో మార్పులే కారణమా..?
● పొట్టదశలో పంట.. రైతుల్లో భయం
దోమకొండ: వాతావరణంలో వస్తున్న మార్పులతో వరి పంటకు ఎండాకు తెగులు సోకుతోంది. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉండగా.. ఆకు చివరి కొనలు ఎండిపోయి కింది వరకు విసరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 3.18 లక్షల ఎకరాల్లో వరిని సాగు కాగా, 4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే జిల్లాలోని దోమకొండతోపాటు కామారెడ్డి, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, రాజంపేట, బాన్సువాడ, లింగంపేట తదితర మండలాల్లో వరి పంటపై ఎండాకు తెగులు తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షాలు, వరదలతో సతమతమవుతున్న తమను ఇప్పుడు ఎండాకు తెగులు ఆందోళనకు గురి చేస్తోందంటున్నారు. అధిక వర్షాలు, వరదలు, వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు ఎండాకు తెగులు సోకడానికి కారణమని రైతులు పేర్కొంటున్నారు. గాలి ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుండగా.. తెగులు కారణంగా పొలాలు ఎండిపోయినట్లు కనబడుతున్నాయి.
తెగులను గుర్తించడం ఇలా..
ఆకులపై పసుపు రంగు నీటి మచ్చలు ఏర్పడి అంచులు ఊడిపోతుంటాయి. ఓ గాజు గ్లాసులో నీరు నింపి ఎండిన ఆకుల చివరి భాగం చిన్నగా కోసి నీళ్లలో వేయాలి. నీరు పనుపు రంగులోకి మారితే పంట తెగులుబారిన పడినట్లు అనుమానించొచ్చు.
తెగులు నివారణకు..
నత్రజని, కాంప్లెక్స్ ఎరువుల వాడకం తగ్గించాలి. సీవోసీ 100 గ్రాములు/ ప్లాంటో మైసిన్ 400 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. స్ట్రెపితోమైసిన్/ప్లాంటో మైసిన్/అగ్రిమైసిన్ 100 లేదా 200 గ్రాములు ఎకరానికి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసి తెగులును నివారించవచ్చు. పొలానికి రోజు విడిచి రోజు తడులు అందిస్తూ ఉండాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు.
దోమకొండ గ్రామ శివారులోని సబ్ స్టేషన్ వద్ద మాకు వ్యవసాయ భూమి ఉంది. మేము సాగు చేసిన వరి ఆకులపై గత రెండు రోజులుగా పసుపురంగు మరకలు వస్తున్నాయి. ఇది ఎండాకు తెగులు అని తెలిసింది. దీంతో పొట్ట దశలో ఉన్న పంట దెబ్బతినే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు చేసి తెగులు నివారణ చర్యలు చేపట్టాలి. – ఎన్ మల్లేశం, రైతు, దోమకొండ

వరికి ఎండాకు తెగులు