
జంక్షన్ విస్తరణ ఎన్నడో..
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఇందిరాచౌక్ జంక్షన్‌లో అభివృద్ధి పనులను రెండు రోజుల క్రితం ప్రారంభించారు. జంక్షన్ విస్తరణ, అభివృద్ధి కోసం పదేళ్ల క్రితమే బల్దియాలో కౌన్సిల్ తీర్మానం చేసి అవసరమైన నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. పాతబస్టాండ్, రైల్వేషన్ ముందు నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ఇందిరా చౌక్‌లో జంక్షన్‌ను విస్తరించి అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. కానీ ఆర్‌అండ్‌బీ విస్తరణను విస్మరించి పనులు చేపడుతోంది. ఇందిరాగాందీ విగ్రహాన్ని తొలగించారు. స్థలం విస్తరణ చేయకుండా పనులు సాగిస్తున్నారు. ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటు చేసి వృత్తాకారంలో స్టీల్ రెయిలింగ్, పచ్చదనం ఏర్పాటు చేస్తున్నారు. అయితే పనులు చేపట్టడంలో బల్దియా, ఆర్‌అండ్‌బీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. మున్సిపల్ టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులకు పనులకు సంబంధించి సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. ఇరుశాఖల సమన్వయంతో ఇందిరాచౌక్ జంక్షన్‌ను విస్తరణ చేసి లైటింగ్, వాటర్ ఫౌంటెయిన్, పచ్చదనంతో మరింత అభివృద్ధి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారి హన్మంత్‌రావును వివరణ కోరగా.. బల్దియా ఆధ్వర్యంలో జంక్షన్ విస్తరణ చేయాలని గతంలోనే కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయని.. దీనికి సంబంధించి తమకు సమాచారం లేదన్నారు. తమకు సైతం సమాచారం లేదని టీపీవో గిరిధర్ తెలిపారు.
పదేళ్ల క్రితమే ఇందిరాచౌక్
విస్తరణకు బల్దియా తీర్మానం
విస్తరణ లేకుండానే
పనులు చేపడుతున్న ఆర్‌అండ్‌బీ
రెండు శాఖల మధ్య
సమన్వయ లోపం