
ఆశావహులకు నిరాశే..
● ఉదయం నోటిఫికేషన్.. సాయంత్రం స్టే
● స్థానిక పోరు తాత్కాలికంగా వాయిదా
కామారెడ్డి క్రైం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హై కోర్టు స్టే విధించడంతో ఆశావహులకు నిరాశ ఎదురైంది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 10.30 గంటలకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. సాయంత్రం 4 గంటలకు హై కోర్టు స్టే విధించినట్లు ప్రకటన వెలువడడంతో ప్రక్రియను అంతటితో నిలిపివేశారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వారికి నామినేషన్ పత్రాలను సైతం పంపిణీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తితో ఉన్న చాలా మంది దరఖాస్తు పత్రాలను తీసుకువెళ్లారు. హై కోర్టులో ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సాగుతోందని తెలిసినా చాలా మంది స్టే వస్తుందని అనుకోలేదు. ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయనే నమ్మకంతో ఉన్న వారికి చివరికి నిరాశే ఎదురైంది.

ఆశావహులకు నిరాశే..