
నవ నైవేద్యాల బతుకమ్మ
తొమ్మిదీ రోజులా లక్ష్మివే బతుకమ్మ
దండాలు మాయన్ని నీకివే బతుకమ్మ..
శంకరుని ఇల్లాల బృహదమ్మ నీవేగ
బతుకమ్మ పేరుతో వస్తివే బతుకమ్మ..
ఎంగిలీ పూలతో సంబురం తెస్తివీ
నువ్వులూ, నూకలూ నీకివే బతుకమ్మ..
ఆశ్వయుజ మాసానా అటుకులా వస్తివీ
సప్పిడీ, బెల్లమూ తీపివే బతుకమ్మ..
మూడవా రోజునా మెరిసేటి బొమ్మవే
పాలబువ్వ అందుకునె పాపవే బతుకమ్మ..
నాలుగో రోజునా కమ్మనీ పాయసం
అందించ వస్తిమీ తాగవే బతుకమ్మ..
చప్పట్ల జోరులో పాటలా హోరులో
అట్లనే నైవేద్యం తింటివే బతుకమ్మ..
పంచమీ రోజునా అలిగినా బొడ్డెమ్మ
పస్తుండి నీళ్ళన్న ముట్టవే బతుకమ్మ..
నూకలా పిండినీ నేతిలో వేయించి
కమ్మటీ వేప్పల్లు నీకివే బతుకమ్మ..
ఎనిమిదో రోజునా వెన్నముద్దవమ్మా
నువ్వులా లడ్డూలు నీకివే బతుకమ్మ..
తొమ్మిదో రోజునా సద్దులా తల్లివే
బంగారి పూలతో సద్దివే బతుకమ్మ..
గంగమ్మ ఒడిలో సాగిపో హాయిగా
మరుయేడు శిశువులా మారవే బతుకమ్మ..
మరుయేడు శిశువులా మారవే బతుకమ్మ..
డొంకేశ్వర్(ఆర్మూర్):
రాసినవారు: సుజాత శేర్ల
– హిందీ టీచర్,
జెడ్పీహెచ్‌ఎస్,
మారంపల్లి (డొంకేశ్వర్)

నవ నైవేద్యాల బతుకమ్మ