కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ విద్యార్థి నునావత్ రాహుల్ విశ్వ విద్యాలయాల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, ఇన్‌చార్జి పీడీ జి.శ్రీనివాస్‌రావులు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి కర్నాటక బెల్గాంలో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాహుల్ పాల్గొంటారని వారు పేర్కొన్నారు.
పోర్టుపోలియో జడ్జిని కలిసిన న్యాయవాదులు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హైదరాబాద్‌లో హైకోర్టు, పోర్టు పోలియో న్యాయమూర్తి నందికొండ నర్సింగ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. కామారెడ్డి కోర్టులో ఉన్న సమస్యలు, పలు అంశాలపై చర్చించారు. న్యాయవాదులు జగన్నాథం, వెంకటరామిరెడ్డి, శ్రీధర్, సురేందర్‌రెడ్డి, తదితరులున్నారు.
రామేశ్వర్‌పల్లి దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడి మృతి
భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివ్వగారి కృష్ణంరాజు (40) గురువారం మృతి చెందారు. ఆయన గత నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. కృష్ణంరాజు గ్రామ మహిళా సంఘంలో సీఏగా పనిచేశాడు. గ్రామ మహిళా సంఘం అభివృద్ధికి కృషిచేయడంతోపాటు ప్రతి మహిళ ఐకేపీ సంఘంలో చేరేలా విస్తృత ప్రచారం చేశారని పలువురు కొనియాడారు. కృష్ణంరాజు అంత్యక్రియల్లో ప్రజలు, నేతలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
రెండు రోజులు భారీ వర్షాలు
కామారెడ్డి క్రైం: వాతావరణ శాఖ సూచనల ప్రకారం జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం ఆయన జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు రాహుల్