
పార్థీ దొంగల ముఠా సభ్యులపై పీడీ యాక్ట్
కామారెడ్డి క్రైం: జాతీయ రహదారులపై దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ దొంగల ముఠాకు చెందిన కొందరిని ఇటీవల కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ ముఠాలోని ముగ్గురు ప్రధాన నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో రహదారుల వెంబడి, దాబా హోటళ్ల వద్ద నిలిపి ఉంచిన వాహనాలను టార్గెట్ చేసుకొని మారణాయుధాలతో దాడులు చేయడం, విలువైన వస్తువులు, నగదు దోచుకోవ డం చేస్తుంటారు. అంతేకాకుండా జాతీయ రహదారుల వెంట ఉండే గ్రామాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను దోచేస్తారు. వీరిపై మహారాష్ట్రలోని ఉద్గిరి నీలం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో హత్య, హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ముఠాలోని ప్రధాన నిందితులైన కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఔరాద్‌కు చెందిన కృష్ణ బాబు షిండే, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మంగ్యాల్ తడాకు చెందిన నాందేవ్, వసూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అజిత్ రమేశ్‌పై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పీడీ యాక్టు ఉత్తర్వులను నిజామాబాద్ జైలులో ఉన్న నిందితులకు అందజేశామన్నారు.