
ప్రజావాణికి 110 వినతులు
ప్రజావాణికి అధికారులు దూరం
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టరేట్ పాలనాధికారి మస్రూర్ అహ్మద్ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవో, ఇతర అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 110 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్‌లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఏవో సూచించారు. అలాగే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.
మత్తడి ఎత్తును తగ్గించాలి..
గ్రామానికి ఆనుకుని ఉన్న మత్తడి ఎత్తును తగ్గించాలని కోరుతూ పాల్వంచ ఎస్సీ కాలనీవాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. గ్రామానికి ఆనుకుని చెమెల్ల కుంట ఉందన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా గతంలో పనులు చేపట్టి కుంట మత్తడి ఎత్తును పెంచారని తెలిపారు. దీంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ కాలనీలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుందన్నారు. కాలనీ సైతం కుంటలా మారుతుందని వాపోయారు. దీంతో పాములు ఇళ్లలోకి రావడం, దోమలు పెరిగి విషజ్వరాలు వస్తున్నాయని తెలిపారు. పెంచిన కుంట మత్తడి ఎత్తును తగ్గించి, జరిగిన నష్టాలకు పరిహారం ఇప్పించాలని ప్రజావాణిలో విన్నవించారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): స్థానిక తహసీల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పలువురు అధికారులు దూరమయ్యారు. కేవలం తహసీల్దార్ శ్రీనివాసరావు, ఏవో సాయికిరణ్‌తోపాటు పీహెచ్‌సీ ఉద్యొగి అనిల్ మాత్రమే ప్రజావాణికి హాజరయ్యారు. కాగా ఎంపీడీవో లలితకుమారితోపాటు ఎంపీవో ప్రభాకరచారి కలెక్టరేట్‌లో జరిగిన సమావేశానికి వెళ్లారు. మండలంలోని మిగతాశాఖల అధికారులు ప్రజావాణికి గైర్హాజరయ్యారు.

ప్రజావాణికి 110 వినతులు