
ప్రమాదకరంగా కల్వర్టు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ఉత్తునూర్ గ్రామ శివారులో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు పూర్తిగా కొట్టుకు పోవడంతో రోడ్డు కోతకు గురైంది. ప్రతి రోజు ఉత్తునూర్ గ్రామ ప్రజలే కాకుండా యాచారం ప్రజలు, కొందరు నిజామాబాద్ వెళ్లే వారు ఈ రోడ్డు గుండా ప్రయాణం సాగిస్తుంటారు. రాత్రింబవళ్లు ఈ దారి గుండా రాకపోకలు సాగుతుంటాయి. ఈ కల్వర్టు పూర్తి దెబ్బతినడంతో ప్రయాణికులు ఈ దారి గుండా రావాలంటే జంకుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన కల్వర్టు వద్ద సంబంధిత శాఖ అధికారులు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికి దృష్టి సారించలేదు. దీంతో గ్రామస్తులే ఆరెంజ్ కలర్‌లో ఉన్న దుస్తుల పేలికలను రోడ్డుకు అడ్డంగా కట్టారు. దీంతో ఈ దారి గుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికై న సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి ప్రమాదకరంగా మారిన కల్వర్టుకు వెంటనే మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.