
నాణ్యమైన విద్య అందిస్తూ..
కన్నబిడ్డల్లా చూసుకుంటా
● ఉత్తమ ఉపాధ్యాయుడిగా
ఎంపికై న లాల్‌సింగ్
నిజాంసాగర్: నాణ్యమైన విద్య అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న అచ్చంపేట ప్రాథమిక పాఠశాల టీచర్ లాల్‌సింగ్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు.
విద్యార్థుల సంఖ్య డబుల్..
లాల్‌సింగ్ 2022 సంవత్సరంలో అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ సమయంలో ఐదు తరగతులలో కలిపి యాభై మంది విద్యార్థులున్నారు. నాణ్యమైన విద్య అందిస్తూ విద్యార్థులలో పఠనాసక్తి పెంపొందించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడి రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తున్నారు. పూర్వ విద్యార్థి సహకారంతో తరగతి గదుల్లో పెయింటింగ్ వేయించారు. విద్యార్థులకు ఉపయోగపడే వాల్ పోస్టర్లు అతికించారు. ప్రతినెలా పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ప్రగతిని వారికి వివరిస్తున్నారు. మంచి విద్య అందిస్తుండడంతో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు సైతం సర్కారు బడి వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 105 మంది విద్యార్థులున్నారు. దాతల సహకారంతో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లు, బ్యాడ్జీలు అందించారు. పాఠశాలలో అర్ధంతరంగా నిలిచిన తరగతి గదుల నిర్మాణ పనులను ఇటీవల కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన గదుల నిర్మాణ పనులకు రూ. 4 లక్షలు మంజూరు చేశారు. ఇలా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న లాల్‌సింగ్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
ఎక్కడ పనిచేసినా బడికి వచ్చే పిల్లలను కన్నబిడ్డల్లా చూసుకుంటాను. వారికి విద్యాబుద్ధులు నేర్పడంతోపాటు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుంటా. అందరి సహకారం వల్లే బడి రూపురేఖలు మార్చగలిగా.
– లాల్‌సింగ్, ప్రధానోపాధ్యాయుడు, అచ్చంపేట

నాణ్యమైన విద్య అందిస్తూ..