కొత్తపల్లి: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌ఓ) సంఘం మండల అధ్యక్షుడు జగదీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు చేస్తున్న ఆందోళనకు మండల వీఆర్‌ఓలు మంగళవారం మద్దతు తెలిపారు. వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణలో మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా వీఆర్‌ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పని చేస్తున్న వీఆర్‌ఏలందరినీ రెగ్యులర్ చేయాలని, అర్హులైన వారికి 70 శాతం ఉద్యోగోన్నతులు కల్పించాలని, మృతి చెందిన వీఆర్‌ఏల కుటుంబాల్లో ఒకరికి వయస్సుతో సంబంధం లేకుండా ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ చిన్నారావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు వీఆర్‌ఏలు పాల్గొన్నారు.
రెండు పొక్లెయిన్ల సీజ్
పెద్దాపురం: పెద్దాపురం శివారు రామేశం మెట్టపై నిరంతరాయంగా జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ‘సాక్షి’ ప్రచురిస్తున్న వరుస కథనాలకు అధికారులు స్పందించారు. రామేశం మెట్టపై అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్న రెండు పొక్లెయిన్లను మంగళవారం సీజ్ చేశారు. మైనింగ్ ఏడీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు టెక్నికల్ అసిస్టెంట్లు సత్యతేజ, రవీంద్ర దాడి చేసి, ఆ పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమ మైనింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై దాడులు చేసి తీరతామని మీడియాకు చెప్పారు.
శిలాఫలకం ధ్వంసం
ఐ.పోలవరం: మండల కేంద్రమైన ఐ.పోలవరం గ్రామ పంచాయతీ పరిధి కుమ్మరి మెరకలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య పథకంలో భాగంగా ఐ.పోలవరంలో రూ.33 లక్షల వ్యయంతో మంచినీటి పథకం నిర్మాణానికి 2023 డిసెంబర్ 4న అప్పటి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా సాగిన ఈ పథకం పనులు.. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు అంచనాలు పెంచి, మళ్లీ శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడకు చేరుకుని విచారించగా, తాపీ మేస్త్రి సలాది బాబ్జీ ఈ పని చేసినట్లు తేలింది. అతడిని పట్టుకుని నిలదీయగా ఆ శిలాఫలకాన్ని తీసేయాల్సిందిగా టీడీపీ మండల కన్వీనర్ సాగిరాజు సూరిబాబు తనకు చెప్పారని అంగీకరించాడు.
దుర్మార్గాన్ని సహించేది లేదు
ఈ దుర్మార్గాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కూటమి నేతల తీరుపై మండిపడ్డారు. పార్టీ మండల అధ్యక్షుడు పిన్నమరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ, కూటమి నేతలు తప్పుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి గుర్తుగా ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేయడం దుర్మార్గమని అన్నారు. వెంటనే శిలాఫలకాన్ని తిరిగి ఏర్పాటు చేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం, ఈ ఘటనపై ఎంపీడీఓ కార్యాలయంతో పాటు పోలీసు స్టేషన్‌లో వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దంతులూరి రాఘవరాజు, ఢిల్లీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.


