కొత్తపల్లి: జనసేన మండల నాయకుల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ రెండు వర్గాలుగా ఉన్న వీరు.. ప్రస్తుతం కుర్చీ ఎత్తి ఆగ్రహం చూపించే స్థాయికి వచ్చారు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రమైన కొత్తపల్లిలోని ముప్పారపు అచ్చియ్యమ్మ కల్యాణ మండపంలో జనసేన నాయకులు మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. దీనికి పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్న నాయకులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై మండల నాయకులను మామిడి సూరిబాబు, మామిడి మల్లిబాబు, పుచ్చల బంగారు బాబీ నిలదీశారు. గ్రామ అధ్యక్షులందరూ కలిసి ఎన్నుకుంటేనే మండల నాయకులయ్యారని, ఇప్పుడు తమను మరచి సమావేశాలు నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడున్న కుర్చీలు విసిరేశారు. వారిని పోలీసుల సహాయంతో వారింపజేశారు. ఇటీవల జనసేనలో ఒక వర్గానికి చెందిన నాయకులు ఆ పార్టీ మండల అధ్యక్షుడిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారని, ఇప్పుడు తామందరం ఒక్కటేనని, కుటుంబంలో వచ్చినట్టే జనసేన కుటుంబంలో కూడా సమస్యలు వస్తూంటాయని, ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పుకొచ్చారు. అభివృద్ధిలో పిఠాపురం దూసుకుపోతోందంటూ ఇటీవల పిఠాపురం బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్న మాటలనే చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో గోదావరి తూర్పు డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రావు అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కొత్తపల్లిలో జనసేన నేతల కుమ్ములాట
ఫ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని
ఓ వర్గం మండిపాటు


