అమలాపురం రూరల్: డబుల్ ఇంజిన్ సర్కార్.. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. క్వాంటమ్ కంప్యూటింగ్.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెగ గొప్పలు చెబుతూంటారు. అభివృద్ధిని అంతరిక్షం స్థాయికి తీసుకుపోతామన్న రీతిలో నేల విడిచి సాము చేస్తూంటారు. అధికారంలో తన పార్ట్‌నర్ అయిన పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చేశారంటూ సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటున్నారు. కానీ, మనిషి ఊపిరి ఆగిపోతే.. అంతిమ ప్రయాణం సాగించడానికి సరైన దారి కూడా చూపలేని దుస్థితి పల్లెల్లో నెలకొన్నా.. అటువైపు మాత్రం సర్కారు పెద్దలు కన్నెత్తి కూడా చూడటం లేదు.
ఒకవైపు తమ ఆప్తుడి ప్రాణం పోయిందన్న తీవ్ర దుఃఖం.. మరోవైపు అడుగు తీసి అడుగు వేస్తే ప్రాణాలు పోతాయేమోనన్నట్లు భయం కలిగించేలా తాత్కాలిక వంతెన.. ఈ పరిస్థితుల్లోనే బంధువులు ఆ మృతదేహాన్ని మోసుకుంటూ సాగించిన కన్నీటి ప్రయాణం.. స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. జీవించి ఉన్నప్పుడు ఎలాగూ వారు నరకమే చూశారు.. కనీసం మరణించిన మనిషికై నా కడసారి గౌరవప్రదమైన వీడ్కోలు లభిస్తుందనుకుంటే అదీ కరువైన విషాద సంఘటన అమలాపురం మండలం వన్నెచింతలపూడి వీరయ్యపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిల్లి వెర్రియ్య (57) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. మృతదేహాన్ని క్రైస్తవ సంప్రదాయంలో సవరప్పాలెంలోని శ్మశానవాటికకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వన్నెచింతలపూడి – సవరప్పాలెం గ్రామాల నడుమ పంట కాలువ అడ్డంగా ఉంది. దానిపై ఉన్న వంతెనను గత మే నెలలో తొలగించి, కొత్త వంతెన నిర్మాణం చేపట్టారు. కాలువలకు నీరు వదలడంతో ఈ పనులు నిలిచిపోయాయి. దీంతో, కాలువ దాటేందుకు గ్రామస్తులు కొబ్బరి దుంగలతో తాత్కాలికంగా చిన్న మార్గం ఏర్పాటు చేసుకున్నారు. దానిపై చాలా జాగ్రత్తగా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఏమాత్రం అడుగు జారినా కాలువలో పడిపోవడం ఖాయం. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ కొబ్బరి దుంగల మీదుగానే మృతుని బంధువులు ఆ మృతదేహాన్ని శ్మశానానికి తరలించాల్సి వచ్చింది. గుండెలు పిండేసే ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో చూసిన వారి కళ్లు చెమర్చాయి. ‘బతికి ఉన్నప్పుడు రాకపోకలకు ఇబ్బందులు.. చనిపోయిన తర్వాత చివరి ప్రయాణానికి కూడా ఇబ్బందులేనా?’ అంటూ వీరయ్యపేట ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.


