కాకినాడ లీగల్: స్థానిక బార్ అసోసియేషన్‌కు రూ.1, రూ.2, రూ.5 విలువ కలిగిన మొత్తం రూ.42 వేల విలువైన కోర్టు ఫీ స్టాంపులను కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా అందించాలని జిల్లా రిజిస్ట్రార్ కె.ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఫీ స్టాంపులు అందుబాటులో లేక న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను జిల్లా రిజిస్ట్రార్ ప్రసాదరావు దృష్టికి కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం తీసుకెళ్లి, వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఫీ స్టాంపులు సమకూర్చాలంటూ జిల్లా రిజిస్ట్రార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పీఎస్‌వీఎస్‌ఎస్ వీరభద్రరావు ఆ స్టాంపులు మంగళవారం అందజేశారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండానే..
స్టాంపుల జారీ నిబంధనలపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 రోజుల క్రితం ఇతర ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కోర్టు ఫీ స్టాంపులు తీసుకొచ్చారు. వాటిని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో విక్రయాలు నిలిచిపోయాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, నాసిక్ నుంచి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి నాన్ జ్యుడీషియల్ స్టాంపులు, కోర్టు ఫీ స్టాంపులు, నోటరీ స్టాంపులు శనివారం వచ్చాయి. వాటిని సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం మాత్రమే విక్రయాలకు అనుమతించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అటువంటిది నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండానే రూ.42 వేల విలువైన కోర్టు ఫీ స్టాంపులు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేయడంపై కార్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


