బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇంటిని మంగళవారం ముట్టడించారు. సీఐటీయూ అనుబంధమైన ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన నాగమల్లితోట జంక్షన్ నుంచి ఎంపీ ఇంటి వద్దకు ర్యాలీగా చేరుకుని, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య తోపులాట జరిగింది. అయినప్పటికీ వారు అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఎంపీ అనుచరులకు వినతిపత్రం అందించారు.
సమస్యలు పరిష్కరించకపోవడం దుర్మార్గం
ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ, అంగన్‌వాడీ, ఆశ సంఘాల ప్రధాన కార్యదర్శులు చంద్రావతి, చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ, 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం తదితర స్కీమ్ వర్కర్లకు కేంద్రం వాటాలో ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పన్నెండేళ్లలో ధరలు విపరీతంగా పెరిగాయని, ఇస్తున్న జీతాలు సరిపోక స్కీమ్ వర్కర్ల కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాలంలో అంబానీ, అదానీ, ప్రధాని మోదీ స్నేహితులైన పెట్టుబడిదారుల ఆస్తులు వందల రెట్లు పెరిగాయని చెప్పారు. ఎన్‌డీఏలో భాగస్వామి అయిన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా వేతనాలు పెంచలేదని ధ్వజమెత్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వేతనాలు ప్రతి మూడేళ్లకోసారి పెంచుకుంటున్నప్పుడు, కరోనా వంటి విపత్కర పతిస్థితుల్లో సైతం ప్రాణాలకు తెగించి ప్రజలకు, పిల్లలకు సేవలందిస్తున్న స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోవడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
స్పందించకపోతే ఇక పోరాటాలే..
తమ సమస్యలపై ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంటులో గళమెత్తి, కేంద్ర ప్రభుత్వం తమ వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని నేతలు, కార్మికులు డిమాండ్ చేశారు. ఇప్పటికై నా వేతనాల పెంపుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. డిసెంబర్ ఒకటి నుంచి మూడో తేదీ వరకూ ఢిల్లీ ముట్టడికి సిద్ధపడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆందోళనలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, కోశాధికారి మలకా రమణ, జిల్లా సహాయ కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకట రమణ, టి.రాజా, సత్యనారాయణ, కాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంపీ ఇల్లు ముట్టడి
ఫ కనీస వేతనం
రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్
ఫ ప్రభుత్వ ఉద్యోగులుగా
గుర్తించాలని నినాదాలు


