వైభవంగా సహస్ర ఘటాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సహస్ర ఘటాభిషేకం

Oct 7 2026 12:11 AM | Updated on Oct 7 2026 12:11 AM

పిఠాపురం: పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయంలో మంగళవారం సహస్ర ఘటాభిషేకా న్ని వైభవంగా నిర్వహించారు. లోక సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ పర్యవేక్షణలో సుమారు 150 పండితులచే, సహస్ర ఘట్టాభిషేకం, వరుణ జపాలు తదితర వైదిక కార్యక్రమాలు జరిపించారు. ఆస్థాన పండితులు, పురోహితులు, అర్చక బృందం మంత్రోచ్ఛారణల మధ్య వేదోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది. దేవదాయ శాఖ జిల్లా అధికారి వర్ధినీడి వెంకటేశ్వరరావు, ఆలయ ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

జువైనల్‌ బోర్డుకు బాలుర తరలింపు

అనపర్తి: బిక్కవోలు మండలం అరికరేవుల గ్రామంలో ఈ నెల 2న ఒంటరి వృద్ధురాలిపై ముగ్గురు బాలురు దాడి చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడి పరారీలో ఉన్న ముగ్గురు బాలురను బిక్కవోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళవారం జువైనెల్‌ జస్టిస్‌ బోర్డు ముందు హాజరుపరచగా, బోర్డు ఆదేశాల మేరకు అబ్జర్వేషన్‌ హోమ్‌కు అప్పగించినట్టు ఎస్సై వి.రవిచంద్ర కుమార్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రాజమహేంద్రవరం రూరల్‌: పురుగు మందు తాగి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ పిడింగొయ్యి వెంకటగిరి ప్రాంతానికి చెందిన నాళం కృష్ణమూర్తి (49) మంగళవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం సమయంలో నాళం కృష్ణమూర్తి పురుగు మందు తాగి, వాంతులు చేసుకున్నాడు. దీంతో అతడిని కుమారుడు శ్రీనివాసరావు చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మంగళవారం మృతి చెందాడు. బొమ్మూరు ఎస్సై ఆర్‌.అంకారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోదావరిలోకి దూకిన వివాహిత

చాగల్లు: వివాహిత గోదావరిలోకి దూకిన ఘటన కొవ్వూరు మండలం సీతంపేట వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంలోని మల్లయ్యపేటకు చెందిన గెల్లా సరిత (27)కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త చిన మంగరాజుతో విడిపోయి పిల్లలతో కలిసి వేరుగా అద్దె ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన చీటి డబ్బులు కట్టడానికి వెళ్లాలని చెప్పి, తన పిల్లలను బావ చాపల సంతోష్‌ కుమార్‌కు అప్పజెప్పింది. అనంతరం బావ కుమారుడితో కలిసి స్కూటీపై ఇంటి నుంచి బయటకు వచ్చింది. కానీ ఆమె ఇంటికి రాకపోవడంతో సాయంత్రం సరితకు సంతోష్‌ ఫోన్‌ చేయగా, అతడి కుమారుడు ఎత్తాడు. సరిత విజేశ్వరం పవర్‌ప్లాంట్‌ వద్ద గోదావరిలో దూకినట్టు చెప్పాడు. వెంటనే బంధువులు, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆమె కోసం గాలించగా ఆచూకీ లభించలేదు. సంతోష్‌ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొవ్వూరు రూరల్‌ ఎస్సై శ్రీహరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement