హోదా సరే.. సిబ్బంది ఏరీ! | - | Sakshi
Sakshi News home page

హోదా సరే.. సిబ్బంది ఏరీ!

Oct 7 2026 12:11 AM | Updated on Oct 7 2026 12:11 AM

ఫ ఇప్పటికే వేధిస్తున్న సిబ్బంది కొరత

ఫ కేసుల దర్యాప్తులో జాప్యం

ఫ కొత్త కమిషనరేట్‌తో మరింత మంది అధికారుల రాక

ఫ పూర్తిస్థాయిలో సిబ్బందిని

నియమించాలని ప్రజల వినతి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం కేంద్రంగా జిల్లాలో పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంపై మేధావులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా శాంతిభద్రతలకు భరోసా లభిస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని సమస్యలను కూడా గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా కమిషనరేట్‌ ఏర్పాటు చేయడం వల్ల కొత్తగా సమకూరే ప్రయోజనాలకు ఎంతకాలం పడుతుందోనని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సిబ్బంది కొరత సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

అప్పట్లో అర్బన్‌ జిల్లాగా..

2010లో అర్బన్‌ జిల్లా ఏర్పడక ముందు ఒక డీఎస్పీ పర్యవేక్షణలో రాజమహేంద్రవరం సబ్‌ డివిజన్‌ ఉండేది. అప్పటి జిల్లా కేంద్రమైన కాకినాడ నుంచి రాజమహేంద్రవరం సుమారు 60 కిలోమీటర్ల దూరం ఉండడంతో పరిపాలన సౌలభ్యం కోసం రాజమహేంద్రవరం సబ్‌ డివిజన్‌ను అర్బన్‌ పోలీస్‌ జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక ఎస్పీని నియమించి, సబ్‌ డివిజన్‌ను నాలుగు జోన్లుగా విభజించి, ఒక్కో జోన్‌కు ఒక్కో డీఎస్పీని ఏర్పాటు చేశారు. అర్బన్‌ జిల్లాలో మొత్తం 14 స్టేషన్లు విలీనమయ్యాయి. ప్రతి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా ఎస్‌సై స్థానంలో సీఐ స్థాయి అధికారిని నియమించారు.

అధికారుల సేవతోనే సరి

ఎప్పుడైతే అధికారులు పెరిగారో సిబ్బందికి సేవా బాధ్యతలు పెరిగాయి. ఎస్పీ క్యాంపు ఆఫీసు, కార్యాలయం వద్ద, నలుగురు డీఎస్పీలు, సీఐల వద్ద సేవలకు కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు స్ధాయి సిబ్బందిని కేటాయించారు. దీంతో సిబ్బంది కొరత ఏర్పడి కేసు దర్యాప్తులకు అవరోధం ఏర్పడింది. అంచెలంచెలుగా సిబ్బందిని పెంచేందుకు పోలీసు శాఖకు 14 ఏళ్లు పట్టింది. ఈలోపు జిల్లాల విభజనలో తూర్పుగోదావరి జిల్లా ఏర్పాటై, కొవ్వూరు డివిజన్‌ కూడా దీనిలో కలిసింది. ఇప్పుడు 29 లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్లు, మూడు సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్లు, మధురపూడి ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌, ఒక మహిళా పీఎస్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ కలిపి మొత్తం 36 పోలీస్‌ స్టేషన్లు జిల్లాలో ఉన్నాయి. జిల్లా ఏర్పడకముందు ఉన్న 1300 మంది సిబ్బందితో పాటు అదనంగా విలీనమైన స్టేషన్ల సిబ్బందితో కలిపి ప్రస్తుతం 1,800 మంది ఉన్నారు. ఇలా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ను సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణ సజావుగా సాగాలంటే కనీసం మరో 2 వేల మంది సిబ్బంది అవసరమని సమాచారం.

పెరిగిన నేరాలు

జిల్లాకు రెండు వైపులా ఏజెన్సీ ఉండడంతో గంజాయి రవాణా విపరీతంగా పెరిగింది. దీంతో పాటు గత పదేళ్లుగా పెరిగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కారణంగా భూదందాలు, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా రహదారి ప్రమాదాలు, నేరాలు ఇటీవల కాలంలో గంజాయి మత్తులో హత్యలు, బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు కావాల్సిన అధికారులను పెంచారు తప్ప, క్షేత్రస్థాయి సిబ్బంది కొరత వేధిస్తోంది. గతేడాది జిల్లాలో 7,685 ఎఫ్‌ఆర్‌లు నమోదు కాగా, వాటిలో మహిళలపై నేరాల కేసులు 802 ఉండడం ఆందోళన కలిగించే విషయం. దీన్ని బట్టి సిబ్బంది కొరత ఎంతగా వేధిస్తుందో చెప్పవచ్చు.

తొందరపాటు చర్యలు!

హడావుడిగా తూర్పుగోదావరి జిల్లాను కమిషనరేట్‌గా ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉండదని, ఇది రాజకీయ మైలురాయి కోసం చేసిన తొందరపాటు చర్యగానే కొందరు భావిస్తున్నారు. ముందుగా తగిన క్షేత్ర స్థాయి సిబ్బందిని ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఫలితాలు ఉండవన్నారు. ఎస్పీ స్థానంలో డీఐజీని, డీఎస్పీల స్థానంలో ఐపీఎస్‌లను, సీఐల స్థానంలో డీఎస్పీలను ఏర్పాటు చేయడం వల్ల తమపై మరింత ఒత్తిడి పెరుగుతుంది తప్ప ప్రజలకు ఒనగూరేదేమీ ఉండదని పోలీసు సిబ్బంది వాపోతున్నారు.

కమిషనరేట్‌ హోదా ఇందుకే...

జిల్లా ప్రధాన కేంద్రమైన రాజమహేంద్రవరం పరిపాలన, వాణిజ్య, విద్యా, రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, కార్పొరేట్‌ వ్యాపార సంస్థల కారణంగా ప్రజల రాకపోకలు ఎక్కువయ్యాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కారణాలతో పోలీసింగ్‌ అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఎస్పీకి మెజిస్ట్రేట్‌ అధికారాలు లేకపోవడంతో తక్షణ చర్యలపై ఆపై ఉన్నతాధికారి ఆదేశాల కోసం వేచి చూడాల్సి వస్తోంది. డీజీపీ స్థాయి అధికారి రావడంతో దానికి చెక్‌ పెట్టవచ్చు. ఎస్పీ డీసీపీ అడ్మినిస్ట్రేటివ్‌గా వ్యవహరిస్తారు. దీంతో పాటు డీసీపీ ట్రాఫిక్‌, డీసీపీ క్రైం, డీసీపీ ఏఆర్‌ పోస్టులు రానున్నాయి. అయితే వీటిని కొత్తగా నియమించడం లేదు. వేరే ప్రాంతంలో ఉన్న వ్యక్తులను ఇక్కడికి తీసుకువచ్చి వారినే ఆ పోస్టుల్లో కూర్చోబెట్టి తంతు నడిపించనున్నారు. దీంతో పాటు ఇందంతా బాగానే ఉంది. అయితే వీటన్నింటినీ నియంత్రించడానికి సిబ్బంది లేకుండా కమిషనరేట్‌ చేస్తే, పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అన్న జిల్లా పరిస్ధితి తయారుకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement