ఫ సమస్యలు విన్నవించేందుకు వచ్చిన
రాజంపేట మహిళలు
ఫ ఆగకుండా వెళ్లిపోయిన
రాజానగరం శాసన సభ్యుడు బత్తుల
సీతానగరం: ఓ కార్యక్రమం కోసం తమ గ్రామం మీదుగా వెళుతున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు సమస్యలు విన్నవిద్దామని రాజంపేట మహిళలు రోడ్డు మీదకు వచ్చారు. తమ దగ్గరకు ఎమ్మెల్యే కారు రావడంతో ఆపాలని అభ్యర్థించారు. కానీ కారు ఆగకుండా వెళ్లిపోవడంతో ఆవేదన చెందారు. తమ సమస్యలను వినే తీరిక కూడా మీకు లేదా ఎమ్మెల్యే సారూ అని వాపోయారు. వివరాల్లోకి వెళితే.. వెదుళ్లపల్లి పంచాయతీ పరిధి రాజంపేటలోని జగనన్న కాలనీ, దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ ధ్వంసమైంది. మురుగునీరు నిలిచిపోయి విపరీతమైన దుర్వాసన వెలువడుతోంది. ఆ మురుగులో దోమలు భారీగా పెరిగి పోయాయి. దీంతో అక్కడి ప్రజలందరూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దోమల కారణంగా పలువురు రోగాల బారిన పడి ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు.
సమస్యలు చెబుదామని..
మునికూడలి గ్రామానికి మంగళవారం వచ్చిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తమ గ్రామం మీదుగా వేరే కార్యక్రమానికి వెళుతున్నారని తెలియడంతో రాజంపేటకు చెందిన గొంతిన అచ్చమ్మ, ఉగ్గిన నాగమణి, పోశమ్మ, యండం ధనమ్మ, మావిడి గంగమ్మ, తామర్తి ఈశ్వరి, ముమ్మిన లక్ష్మి, శ్రీలక్ష్మి, కుమారి, పెండా రమణ, పంచాయతీ మూడో వార్డు మాజీ మెంబర్ దుర్గాప్రసాద్ తదితరులు రాజమహేంద్రవరం – సీతానగరం నాలుగు లేన్ల రోడ్డు వద్ద వేచి ఉన్నారు. అటుగా వచ్చే ఎమ్మెల్యేకు తమ ప్రాంతంలోని సమస్యలు విన్నవిద్దామని, పరిష్కరించాలని కోరదామని ఆశ పడ్డారు. దూరంగా వస్తున్నఎమ్మెల్యే కారును చూసి ఆపాలని కోరారు. కానీ కారు ఆగకుండా వేగంగా వెళ్లిపోవడంతో నిరాశ చెందారు. తమ సమస్యను వినే తీరిక కూడా ఎమ్మెల్యేకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయ కులు, గెలిచిన తర్వాత తమతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. తక్షణమే డ్రైనేజీ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.


