అనపర్తి: అదృశ్యమైన తన భర్త ఆచూకీ తెలపాలంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు అనపర్తి ఎస్సై బి.వినయ్ ప్రతాప్ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అనపర్తి గ్రామానికి చెందిన సింగంశెట్టి రవికుమార్ (32) ఈ నెల 1 నుంచి కనిపించకుండా పోయారు. ఆ రోజు ఉదయం పిల్లల విషయమై భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. అనంతరం పిల్లలకు పాఠశాలలో లంచ్ బాక్స్ ఇచ్చి వస్తానని చెప్పి, ఇంట్లో నుంచి బయలుదేరిన రవికుమార్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో భార్య వరలక్ష్మి ఆయన మొబైల్‌కు ఫోన్ చేశారు. అయితే ఆయన తన ఫోన్, ద్విచక్ర వాహనాన్ని ఇంట్లోనే వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు. పాఠశాల వద్ద విచారించగా, రవికుమార్ నడుచుకుంటూ వచ్చి లంచ్ బాక్స్ ఇచ్చి వెళ్లినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. బంధువులు, పరిసర ప్రాంతాల్లో ఎంత గాలించినా ఆయన ఆచూకీ లభించకపోవడంతో వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


