కాస్త నిమ్మదిస్తున్న ధర | - | Sakshi
Sakshi News home page

కాస్త నిమ్మదిస్తున్న ధర

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

కూలీల ఖర్చు పెరిగింది

మార్కెట్లో నిమ్మకాయల ధర నెమ్మదిగా తగ్గుతుంది. మొన్నటి వరకు కిలో రూ.80 పలకగా, ప్రస్తుతం రూ.60 ధర వస్తుంది. ఈ ఏడాది ధర బాగుంది. మూడెకరాల్లో మూడు నెలలకు 3 బస్తాల (150 కిలోలు) కాయల దిగుబడి మాత్రమే వచ్చింది. తోట అంతా తిరిగినా బస్తా కాయలు దొరకడం కష్టంగా ఉంది. కూలీల ఖర్చు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. దిగుబడులు లేకపోవడం వల్ల ధర పెరిగింది. దుకాణాల్లో కాయ రూ.5 నుంచి రూ.7 అమ్ముతున్నారు.

– శ్రీరంగం వీరనాగు, రైతు,

కొత్తగూడెం, దేవరపల్లి మండలం

దేవరపల్లి: అమాంతం పెరిగిన నిమ్మ కాయల ధర కాస్త నెమ్మదిస్తుంది. మొన్నటి వరకు కిలో రూ.80 నుంచి రూ.100 పలకగా.. సోమవారం యాదవోలు మార్కెట్లో కిలో రూ.60 నుంచి రూ.65 ధర వచ్చిందని రైతులు తెలిపారు. ఈ ఏడాది వర్షాకాలంలో కిలో అత్యధిక ధర రూ.106 వచ్చింది. ప్రస్తుతం వర్షాలు లేక పంట దిగుబడి లేకపోవడం, నల్లమంగు తెగులు సోకడంతో ఇబ్బంది వచ్చింది. ఇదే మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణమైంది. సాధారణంగా వర్షాకాలంలో ఏటా జూలై నుంచి అక్టోబర్‌ వరకు నిమ్మకాయలకు డిమాండ్‌ ఉండదు. ఈ సీజన్‌లో కిలో రూ.8 నుంచి 10 ధర ఉండేది. ఏటా వర్షాకాలంలో దిగుబడులు పెరగడంతో ధర తక్కువగా ఉండేదని రైతులు తెలిపారు. ఈ ఏడాది తోటల్లో కాపులు లేక దిగుబడులు గణనీయంగా పడిపోవడంతో ధర పెరిగిందని వివరించారు. మూడు నెలలకు ఎకరాకు 50 కిలోల కాయలు దొరకడం కష్టంగా ఉందని అంటున్నారు. మార్కెట్లోకి గత వారం నుంచి కొత్తకాయలు రావడంతో ధర తగ్గిందని వ్యాపారులు తెలిపారు. దసరా నుంచి ధర పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యాదవోలు మార్కెట్‌కు ప్రస్తుతం 25 టన్నుల కాయలు అమ్మకానికి వస్తున్నాయి. నిమ్మ తోటల్లో దిగుబడి తగ్గడం, గిట్టుబాటు కాకపోవడంతో యాదవోలు పరిసర గ్రామాల రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్‌పామ్‌, వేరుశెనగ పంటలు వేస్తున్నారు. నిమ్మ తోటలను తీసివేసి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నట్టు రైతులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement