ఆటో, మోటార్‌ సైకిల్‌ ఢీ | - | Sakshi
Sakshi News home page

ఆటో, మోటార్‌ సైకిల్‌ ఢీ

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

ఇద్దరి మృతి

సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రావువారి చంద్రంపాలేనికి చెందిన డ్వాక్రా మహిళలు సామర్లకోటలో బ్యాంకు రుణం తీసుకునేందుకు వచ్చి పని ముగించుకొని తిరిగి ఆటోలో ఇంటికి బయలు దేరారు. ఈ నేపథ్యంలో పిఠాపురం రోడ్డులో లక్కీ దాబా సమీపానికి వచ్చేసరికి, ఎదురుగా మోటారు సైకిల్‌పై టిడ్కో గృహ సముదాయానికి చెందిన మద్దాబత్తుల శంకర్‌ (28) వస్తుండగా రెండు వాహనాలూ ఢీకొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు రోడ్డుపై పడిపోయారు. దాంతో చంద్రంపాలెం గ్రామానికి చెందిన ఇజ్జన కృపావతి (65) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మహిళలు, మోటారు సైకిలిస్ట్‌ శంకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. శంకర్‌ను సామర్లకోట ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ రోడ్డులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

యువకుడి దుర్మరణం

పెద్దాపురం: రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్దాపురం పట్టణంలోని గణేష్‌ నగర్‌ కాలనీకి చెందిన అల్లు నూకేష్‌ (24) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి ఇటీవలే వివాహం జరిగింది. అతని భార్య గర్భిణి. సోమవారం సాయంత్రం నూకేష్‌ తన బైక్‌పై పశుగ్రాసం కట్టుకుని పాత పెద్దాపురం ఏలేరు బ్రిడ్జి వంతెన నుంచి బొమ్మల రామాలయం సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వచ్చిన మరో బైక్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో నూకేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మరో బైక్‌పై ఉన్న ఒకటో వార్డు ఎస్సీ పేటకు చెందిన బత్తిన లక్షబాబు, బత్తిన సంతోష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని పెద్దాపురం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. దీనిపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement