అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
తుని: స్థానిక గాంధీసత్రం వంట గదిలో మహిళ మృతదేహాం లభ్యం కావడం పట్టణంలో కలకలం రేపింది. ఆదివారం ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ ఎం.గీతా రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తుని మండలం ఎన్‌ఎస్ వెంకటాపురానికి చెందిన గుడాల వెంకటలక్ష్మి (60) కొంతకాలంగా తుని రైల్వేస్టేషన్ ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైల్వేస్టేషన్ నుంచి బయటకు తీసుకువెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గాంధీసత్రం దగ్గరకు తీసుకువెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేసి ఉండవచ్చుననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మృతురాలి మెడపై చిన్నపాటి గాయం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాకినాడ నుంచి క్లూస్ టీంను రప్పించి సంఘటనా స్థలంలో వేలి ముద్రలను సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. దర్యాప్తులో లభ్యమైన ఆధారాలను పరిగణలోకి తీసుకుని నిందుతుడిని పట్టుకుంటామని చెప్పారు.


